జగన్‌ దగ్గర ముగిసిన గన్నవరం పంచాయితీ

జగన్‌ దగ్గర ముగిసిన గన్నవరం పంచాయితీ
అమరావతి : సీఎం జగన్‌ దగ్గర గన్నవరం పంచాయితీ ముగిసింది. వైసీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎంను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావు కలిశారు.  పార్టీ బలోపేతానికి పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావుకు జగన్‌ సూచించారు. ఈ భేటీలో యార్లగడ్డ  రాజకీయ భవిష్యత్తుపై జగన్ హామీ ఇచ్చినట్లు సమచారం. దీంతో వెంకట్రావు మెత్తపడినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశం తర్వాత పేర్నినాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావు ఒకే కారులో వెళ్లిపోయారు. గన్నవరం పంచాయతీకి ముగింపుపలకడంతో వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ఇటీవల తనను రాజకీయంగా ఎదుర్కోలేక యార్లగడ్డ వెంకట్రావు, రవికుమార్‌ అనే వైసీపీ సానుభూతిపరుడితో కలిసి తనపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వంశీ ఆరోపించారు. పోలీసులు కూడా ఎలాంటి విచారణ లేకుండా కేసు నమోదు చేశారని వివరించారు. ఇందులో కుట్ర కోణం దాగుందని, పూర్తి ఆధారాలను తాను సేకరించానని వాటిని గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేస్తానని వంశీ చెప్పారు. యార్లగడ్డను టార్గెట్ చేస్తూ ఆరోపణలను గుప్పించిన వంశీ, ఆయనతో కలిసి వైసీపీలో సమైక్య రాగం ఆలపిస్తారా? లేక వేరు కుంపట్లతో వైసీపీకి తలనొప్పి అవుతారో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.