21న సీఎం జగన్ ముమ్మిడివరంలో పర్యటన
తూర్పుగోదావరి : గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని పేర్కొన్నారు. సుమారు రూ.90 కోట్లు వేట నిషేధం నష్టపరిహరాన్ని మత్స్యకారులకు ఇవ్వాల్సి ఉందని వెంకటరణ తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారని గుర్తుచేశారు. నష్టపరిహరం కోసం ఓఎన్జీసీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని సీఎం జగన్ సంప్రదించారని పేర్కొన్నారు. సీఎం ముమ్ముడివరం పర్యటనలో ఆ నష్టపరిహరాన్ని అందిస్తారన్నారు. ఆ రోజు మత్స్యకారులకు డీజిల్ సబ్సీడి రూ.9 లకు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 84 బంక్‌లను గుర్తించామని వెల్లడించారు. డీజిల్ కొట్టించుకున్న రోజునే స్మార్ట్ కార్డు ద్వారా సబ్సీడి వస్తుందని స్పష్టం చేశారు. డీజిల్ సబ్సీడి కోసం మత్స్యకారులు గతంలో మాదిరిగా ప్రభుత్వాలు చుట్టు తిరిగే పరిస్ధితి లేదని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి మోపిదేవి మండిపడ్డారు.
21న సీఎం జగన్ ముమ్మిడివరంలో పర్యటన