వచ్చే ఉగాదినాడు 25లక్షల మందికి రిజిష్టర్డ్ ఇళ్ళపట్టాల డాక్యుమెంట్లు పంపిణీ:ఇన్ చార్జి సిఎస్


రాా


అమరావతి, 8 నవంబరు: రాష్ట్రంలోని ఇళ్ళు లేని ప్రతి పేదవానికి ఇళ్ళు సమకూర్చే లక్ష్యంలో భాగంగా వచ్చే ఉగాదినాడు 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిష్టర్డ్ డాక్యుమెంట్ తో కూడిన ఇళ్ళ పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సిసిఎల్ఏ మరియు ఇన్ చార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.  ఈ అంశంపై శుక్రవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసిల్దార్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ చార్జి సిఎస్ మాట్లాడుతూ ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల రిజిష్టర్ డాక్యుమెంట్లు పంపిణీ చేయడానికి వీలుగా గ్రామాలవారీగా ప్రభుత్వ భూములను గుర్తించడం తోపాటు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. గుర్తించిన లబ్ధిదారులకు కేవలం రిజిష్టర్డ్ ఇళ్ల పట్టాల డాక్యుమెంట్లను ఇవ్వడంతో పాటు వారి ప్లాటు ఎక్కడుందీ స్వయంగా ఆయా లబ్ధిదారులు చూసే విధంగా ప్రత్యేకంగా ప్లాట్లుగా కేటాయించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాల నుండి అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకూ 22 లక్షల వరకూ లబ్ధిదారుల గుర్తింపు పూర్తి చేశారని మిగతా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జెసిలను ఆర్డీఓలను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఇళ్ళ స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్నవో మొదటగా గుర్తించాలని చెప్పారు. అదే విధంగా ఇళ్ళ స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉండీ లిటిగేషన్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్ సమర్పించి ఆ భూములను ఇళ్ళ పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు.


అర్హుడైన ఏ ఒక్క లబ్ధిదారుడు ఇళ్ళ స్థలం రాకుండా మిగలడానికి వీలులేదని అదే సమయంలో అనర్హులెవరూ లబ్ది పొందడానికి వీలులేని రీతిలో ఈ ప్రక్రియను అత్యంత పగడ్భందీగా నిర్వహించాలని ఇన్ చార్జి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. ఇళ్ళ స్థలాలకై ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాలవారీ మ్యాపింగ్ చేసే ప్రక్రియను చేపట్టాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా అభ్యంతరంలేని ఆక్రమణ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇళ్ళ స్థలాలకై వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు వద్ద గల ప్రభుత్వ భూములన్నీ గుర్తించాలని చెప్పారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ద్వారా ఇళ్ళు నిర్మిస్తున్న లబ్ధిదారుల వివరాలను తెలుసుకోవడంతోపాటు వివిధ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల వద్ధ ఇళ్ళ స్థలాల నిమిత్తం ఉద్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని ఆదేశించారు. ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను సేకరించాల్సిన పరిస్థితులుంటే ముఖ్యంగా రెండు పంటలు పండే డెల్టా ప్రాంతాల్లోని భూముల సేకరణ విషయంలో అత్యంత జాగ్తత్తగా వ్యవహరించాలని జెసిలను ఇన్ చార్జి సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు పూర్తిగా భాగస్వాములు కావాలని ఆయన స్పష్టం చేశారు.


రెవన్యూశాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ, ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఇళ్ల స్థలాలకై కేటాయించిన భూములను, భూదాన భూముల స్థితిగతులను కూడా తెలుసుకోవాలని చెప్పారు. 


రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి నారాయణ మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలకై ఇప్పటి వరకూ 23 వేల 180 ఎకరాల భూములను గుర్తించడం జరిగిందని మిగతా అవసరమై భూములను త్వరగా గుర్తించాలని జెసిలను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 10 వేల మంది సర్వేయర్లు అందుబాటులో ఉన్నారని గుర్తించిన భూముల పెగ్ మార్కింగ్, ప్లాట్లుగా కేటాయించేందుకు వారి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు.


ఈ వీడియో సమావేశంలో సిసిఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.