శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం

శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
ఏడాదికోసారి మాత్ర‌మే ఆల‌యం నుండి వెలుపల‌కు
ఘనంగా  కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల : కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శ‌నివారం సాల‌క‌ట్ల కైశిక ద్వాదశి ఆస్థానం ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఉభయనాంచారులతో కలిసి తిరుమాడ వీధులలో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆనంత‌రం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ మ‌హావిఫ్ణువు స్వ‌రూపంగా భావించే  శ్రీ‌వారి ఆల‌యంలో కైశిక ద్వాద‌శిని ప్ర‌తి ఏటా నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడ వీధులలో ఊరేగిస్తారని తెలిపారు. ఈ ఉత్స‌వ నేప‌థ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వ‌హించే సుప్ర‌భాతం, తోమాల, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. కైశిక ద్వాద‌శి సంద‌ర్భంగా స్వామివారి కృపాక‌టాక్షాలు భ‌క్తులంద‌రిపై ఉండాల‌ని ఆకాంక్షించారు.


ప్రాశ‌స్త్యం : పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.
నంబ‌దువాన్ క‌థ‌ :  కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్‌ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి అద‌నపు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.