జగన్మోహన్ రెడ్డి 6నెలల పాలనలో 12 రకాల దోపిడి

*జగన్మోహన్ రెడ్డి 6నెలల పాలనలో 12 రకాల దోపిడి*
పత్రికా ప్రకటనలో యనమల రామకృష్ణుడు ధ్వజం
సీఎం జగన్మోహన్ రెడ్డిగారి 6నెలల అవినీతిపాలనలో 12రకాలుగా దోపిడికి తెరదీశారు. తొలి 6నెలల్లో బెస్ట్ సీఎంగా అనిపించుకుంటానని చెప్పి, ఇంతకన్నా చేతగాని సీఎం ఉండరనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. తుగ్లక్ పాలనతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారు.
1)  చౌకధరకు అమ్మకానికి ఆంధ్రప్రదేశ్, అదికూడా జగన్ అనుయాయులకే..(ఏపి ఫర్ సేల్ ఎట్ చీపర్ రేట్స్ , దట్ టూ ఓన్లీ సీఎం జగన్ హించ్ మన్): చౌకధరలకు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను తన తాబేదారులకు అమ్మేయడం, తద్వారా వచ్చిన సొమ్ముతో నవరత్నాలు అమలు చేస్తానని చెప్పడం. ప్రపంచ చరిత్రలోనే ఈ విధంగా సంక్షేమంలో పెడ ధోరణులు గతంలో చూడలేదు. భూములమ్మి సంక్షేమం చేస్తానన్న పెద్దమనిషిని ఇప్పుడే చూస్తున్నాం. ఏపిలో ఉన్న ప్రభుత్వ భూములే అతిస్వల్పం. ఉన్న భూములు అమ్మేస్తే, ప్రభుత్వాన్ని దివాలా తీయించడమే. భూముల అమ్మకం ముసుగులో సొంత అనుచరులకు వాటిని కట్టబెట్టాలనే జగన్మాయ ఇందులో ఉంది. దానికి సంక్షేమం అనే ముసుగు వేయడం పేదలను వంచించడమే.
2).తన మంత్రుల బినామీలకే గనుల లీజులు(మైనింగ్ లీజెస్ టు హిజ్ మినిస్టర్స్ బినామీస్): అన్ని జిల్లాలలోని మైనింగ్ లీజులను తన మంత్రులు,వాళ్ల బినామీల పరం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లీజుదారులను బెదిరిస్తున్నారు. తమ బినామీలకు ఆ లీజులు కట్టబెట్టి వాటిలో 50: 50 వాటాలు పంచుకుంటున్నారు. ముగ్గురాళ్ల దోపిడి నుంచి ఇనుప ఖనిజం లూటివరకు ఆరితేరిన జగన్ కుటుంబం మైనింగ్ దోపిడినే సొంత ఆదాయ వనరుగా చేసుకుంది. సున్నపురాయి, లేటరైట్,బాక్సైట్,గ్రానైట్ అన్ని ఖనిజాలను దోచేస్తున్నారు.
3).వైసిపి శాండ్ మాఫియాతో ఇసుక లూటి: కావాలనే కృత్రిమ ఇసుక కొరత సృష్టించారు, అయిదో వంతు మాత్రమే ఇసుక(లక్షా 50వేల టన్నులకు 30వేల టన్నులు మాత్రమే) తీస్తున్నారు. 5రెట్ల అధిక రేట్లకు(రూ.10వేల నుంచి రూ.50వేలకు సగటున) అమ్ముతున్నారు. పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో నిర్మాణ పనులన్నీ ఆపేశారు, ఉన్న ఇసుక అంతటినీ తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలకు తరలిస్తున్నారు. కూలీలంతా పనుల కోసం ఆయా రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్ముతున్నారంటే వీళ్ల దోపిడి ఏ స్తాయిలో ఉందో విదితం అవుతోంది. 
4).నిరుపేదలపై పన్నుల భారం తడిపిమోపెడు (ట్యాక్స్ బర్డన్ ఆన్ కామన్ మ్యాన్): ఇసుక కొరత తెచ్చి పేదల ఆదాయ మార్గాలు మూసేశారు. సామాన్యుల కొనుగోలు శక్తిని దెబ్బతీశారు. పొదుపు శక్తిని చావుదెబ్బ తీశారు.  అటు కరెంటు బిల్లులు చెల్లించలేక, ఇటు పన్నుల భారంతో పేద, మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లుతున్నారు. రేపో మాపో మళ్లీ కరెంటు ధరలు పెంచుతామని, భూమి శిస్తు వేస్తామని అంటున్నారు.
5).పేదల సంక్షేమానికి కోతలు: రూ.5కే పట్టెడన్నం పెట్టే ''అన్నా కేంటిన్లు'' మూసేశారు. పండుగ కానుకలు రద్దు చేశారు. గిరిజనులకు ఫుడ్ బాస్కెట్ తీసేశారు. ఆహార భద్రతనే ప్రశ్నార్ధకం చేశారు. ''చంద్రన్న బీమా'' అటకెక్కించారు. ''పెళ్లి కానుకలు'' వాయిదా వేశారు. టిడిపి తెచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని రద్దు చేయడమో, కోత విధించడమే పనిగా పెటుకున్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేల ఆర్ధిక సాయం ఆశలు పెట్టి, కేవలం  లక్షన్నరమందికే ఇచ్చి 5లక్షల మందికి ఎగ్గొట్టారు.
6).నవరత్నాలను జగన్మాయగా చేశారు: రైతు భరోసాలో రూ.5వేలు ఎగ్గొట్టారు ఒక్కో రైతుకు. ఎన్నికల ముందే కేంద్రం ఇచ్చే పథకాన్ని అందులో కలిపేసి రైతులకు రూ.20వేల కోట్ల మోసం చేశారు. పించన్ నెలకు అదనంగా రూ.1,000పెంచుతానని చెప్పి రూ.750ఎగ్గొట్టారు. కేవలం రూ.250మాత్రమే పెంచి వృద్దులు,వికలాంగులు,అనాధ మహిళలకు రూ.10వేల కోట్ల మోసం చేశారు. ఏడాదికి 5లక్షల ఇళ్ల్లు కడతామని చెప్పారు, 6నెలల్లో రెండున్నర లక్షల ఇళ్లు కట్టాల్సివుండగా, 250ఇళ్ళు కూడా కట్టలేదు. 
7).వైసిపి లూటికీ అధికారులను పావులుగా మార్చారు: అధికార యంత్రాంగాన్ని వైసిపి నేతల దోపిడిలో పావులుగా చేశారు. చెప్పినట్లు చేయని అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, విఆర్ లో పెట్టడం, దోపిడికి సహకరించేవారినే అందలాలు ఎక్కించారు. కేవలం 5నెలలకే సీఎస్ ఎల్ వి సుబ్రమణ్యం బదిలీనే అందుకు రుజువు. హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను తొలగించారన్న అక్కసుతోనే సీఎస్ సుబ్రమణ్యంను బలిచేశారు.
8).పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం: 6నెలల్లో 640పైగా తప్పుడు కేసులు టిడిపి కార్యకర్తలపై, నాయకులపై బనాయించడమే పోలీసు యంత్రాంగం దుర్వినియోగానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇన్ని హత్యలు, హత్యాయత్నాలు, భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు రాష్ట్ర చరిత్రలో గతంలో లేవు. ఎవరైతే తమ చెప్పుచేతల్లో ఉంటూ, టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడతారో వాళ్లకే ప్రాధాన్య పోస్ట్ లు ఇస్తున్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించే వారిని వీఆర్ లో పంపారు, అప్రాధాన్య పోస్టులకే పరిమితం చేశారు.
9).రివర్స్ గేర్ లో అభివృద్ది: రివర్స్ టెండరింగ్  విధానం అనిచెప్పి రాష్ట్రాభివృద్దినే రివర్స్ చేశారు. టిడిపి ప్రభుత్వ పాలనలో ప్రతిఏటా రెండంకెల వృద్దితో దేశంలోనే పురోగమన రాష్ట్రంగా ఏపి ఉంటే, 5నెలల్లోనే ఏపిని తిరోగమనం పట్టించారు. పోలవరం పనులు నిలిపేశారు, అమరావతి ఆపేశారు. పరిశ్రమల్లో వాటాలు ఇవ్వాలని పెట్టుబడిదారులను బ్లాక్ మెయిలింగ్ చేశారు. సింగపూర్ కన్సార్షియం, రిలయన్స్, అదాని, ఆసియన్ పేపర్ మిల్స్ ,టిసిఎల్ అన్నీ వెనక్కి పోయాయి. వరల్డ్ బ్యాంకు, ఏసియన్ బ్యాంకు రుణాలు క్యాన్సిల్ అయ్యాయి. అప్పులివ్వడానికి ఏ బ్యాంకు ధైర్యం చేయడం లేదు. ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయడంలేదు. 
గత 6నెలల్లో ఏ ఒక్క పరిశ్రమలోనూ కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు. ఉన్న ఉద్యోగాలను తీసేసి వారిని ఆత్మహత్యల పాలు చేసి, వైసిపి కార్యకర్తల జేబులు నింపుతున్నారు. పిపిఏల రద్దుతో దేశంలోనే కాదు, విదేశాల్లో అప్రదిష్ట తెచ్చారు. గవర్నమెంట్ టెర్రరిజంతో ఏపి అంటేనే భయపడే దుస్థితి కల్పించారు. బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపిలో భయానక వాతావరణం సృష్టించారు.
10).భయానకంగా రాజకీయాలు (టెర్రర్ పాలిటిక్స్): రాజకీయాలనే భయానకం చేశారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు 15మంది హత్యలు-ఆత్మహత్యలకు వైసిపి ప్రభుత్వం కారణం అయ్యింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు. 131మందిపై అక్రమ కేసులు బనాయించారు. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకోవడమే ఏపిలో వైసిపి ప్రభుత్వ టెర్రర్ పాలిటిక్స్ కు ప్రత్యక్ష రుజువు.
11) పిచ్చి తుగ్లక్ పాలనతో ఏపికి అప్రదిష్ట: రాజధాని ఎక్కడో నిర్ణయాణికి 20జులై 2014నే ఒక కమిటి వేసి అమరావతిని ఎంపిక చేశాం. అసెంబ్లీలో అమరావతి ఎంపికను జగన్ స్వయంగా స్వాగతించారు, 30వేల ఎకరాల భూమి రాజధానికి కావాలని అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధానిపై జిఎన్ రావు కమిటి వేయడం తుగ్లక్ చర్యే..
అబ్దుల్ కలామ్ పేరు తీసేసి తండ్రి పేరు పెట్టడం ఇంకో తుగ్లక్ చర్య. జాతీయ జెండా రంగులు తుడిపేసి వైసిపి రంగులేయడం మరో తుగ్లక్ చర్య. అన్నా కేంటిన్ల రంగులు మార్చేసి, వాటిని మూసేయడం ఇంకో తుగ్లక్ చర్య.
12).సాక్షియేతర మీడియాపై ఉక్కుపాదం: ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు. జివో 2430తెచ్చి మీడియా నోరు నొక్కేసే కుట్రలు చేస్తున్నారు. 2 చానళ్ల ప్రసారాలను నిలిపేస్తే, రోజుకు రూ.2లక్షలు జరిమానా ట్రాయ్ విధించింది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, వారాల తరబడి జైళ్లకు పంపుతున్నారు. 
వైసిపి నేతల దుశ్చర్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇంత స్వల్ప కాలంలో ఇంతగా చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని చూడలేదు. దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు.
యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత