శివనామస్మరణలతో మార్మోగిన శైవ క్షేత్రాలు

శివనామస్మరణలతో మార్మోగిన శైవ క్షేత్రాలు


ఉదయగిరి: లయకారుడు ఓంకారేశ్వరుని నామస్మరణలతో ఉదయగిరి ప్రాంతం కొండ కోనల్లో వెలసియున్న శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. హర హర శంభో శంకర అంటూ భక్తులు వివిద ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. విశేషాలంకరణలో కొలువుదీరిన ఆది దంపతులకు జల, పాలాభిషేకాలు చేసి భక్తులు వెలిగించిన దీప కాంతులతో ఆలయాల్లో ఆధ్యాత్మిక కాంతులు విరబూశాయి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి శివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి కరమైన రోజుగా పురాణాలు పరిగణిస్తున్నాయి. సీతారామపురం మండలం దేవమ్మ చెరువు పంచాయితీ పరిధిలోని ఘటిక సిద్ధేశ్వరం, భైరవకోనలో ఒకే రాతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలను ప్రతిష్టింపబడిన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భైరవకోనలో 101 కోనేర్ల నుండి వెలువడే సొనవాన జలపాతంలో భక్తులు స్నానమాచరించిన అనంతరం శివ దర్శనాలకు బారులు తీరారు. దుత్తలూరుకు సమీపంలోని ఊరకొండపై వెలిసిన శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో నడక మార్గం ద్వారా కొండకు చేరుకున్నారు. అపారమైన అడవులు కలిగిన ఈ ప్రాంతాలలోని కొండలలో కొలువుదీరిన ఓంకారేశ్వరుని ఆలయాలును చూసి తరించేందుకు నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక వాహనాలు, ఆర్.టి.సి బస్సులలో తరలివచ్చారు.....