తిరుమల :
శ్రీవాణి ట్రస్టు దాతల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం
* టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు విరాళాలందించే దాతల కోసం నవంబరు 4న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభించామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ వారంలో శుక్రవారం 200 బ్రేక్ దర్శన టికెట్లు, మిగతా రోజుల్లో 500 బ్రేక్ దర్శన టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. డిసెంబరు 31వ తేదీ వరకు ఆన్‌లైన్ కోటాను విడుదల చేశామన్నారు. నవంబరు 4న మొదటిరోజు ఏడుగురు దాతలు రూ.10 వేలు చొప్పున విరాళం అందించి బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారని వివరించారు. అక్టోబరు 21 నుండి ఇప్పటివరకు 1109 మంది దాతలు రూ.1.10 కోట్లు విరాళాలు అందించారని తెలియజేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని బ్రేక్ దర్శనానికి వెళ్లవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టిటిడి ఈ ట్రస్టును ప్రారంభించిందని అదనపు ఈవో తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్‌గా అందిస్తామన్నారు. రూ.500/- చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఒక రూపాయి నుండి ఎంతమొత్తమైనా విరాళంగా అందించవచ్చని, రూ.10 వేల నుండి టిటిడి కల్పించే ప్రయోజనాలు వర్తిస్తాయని వివరించారు. రూ.10 వేలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ చొప్పున 99 వేల వరకు 9 టికెట్లను దాతలు పొందే అవకాశముందన్నారు. ఒక లక్ష పైన విరాళాందించే దాతలకు టిటిడి ఇదివరకే పలు ట్రస్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న తరహాలోనే ప్రయోజనాలను వర్తింపచేస్తామని తెలిపారు.
మీడియా సమావేశంలో టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు.
శ్రీవాణి ట్రస్టు దాతల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం