వైయస్సార్‌సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం శ్రీ వైయస్. జగన్*


*అమరావతి*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ తో సమావేశం అనంతరం వైయస్సార్సీపీ ఎంపీలు మీడియా సమావేశం వివరాలు*


*పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై వైయస్సార్‌సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం శ్రీ వైయస్. జగన్*


*ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సమావేశాల్లో మా గళం గట్టిగా వినిపించమని సీఎం చెప్పారు: ఎంపీ పి.మిథున్‌ రెడ్డి*


*పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం*
 
*ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయంపై మేము ముఖ్యమంత్రికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపాం*


*రామాయపట్నం పోర్టు, వైద్య కళాశాలల ఏర్పాటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల కోసం పార్లమెంటులో ప్రశ్నిస్తాం: మిథున్‌రెడ్డి*


అమరావతి : త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలందరికీ దిశా, నిర్దేశం చేశారని వైయస్సార్‌సీపీ ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి, సీఎం అదేశాల ప్రకారం  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వైయస్సార్‌సీపీ తరపున గట్టిగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు గత సమావేశాల్లో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా గళం వినిపించామని, రాబోయే సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో  ప్రత్యేక హోదా మొదటి ప్రాధాన్యాంశంగా పోరాడాలని సీఎం సూచించారన్నారు.
 దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవాలని సీఎం కోరారని ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి తెలిపారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన నేపధ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు పూర్తిగా విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, అందుకే దీనిపై గట్టిగా పట్టుబట్టాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు. ఆ దిశలో తామంతా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేసి పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల మొదటి ప్రాధాన్యతగా ప్రయత్నిస్తామని వెల్లడించారు.  రాబోయే రోజుల్లో కాఫర్‌ డ్యాం పూర్తైతే తక్షణమే భూసేకరణ కోసం దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయని, అందువల్ల ఆ నిధుల కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి తెలిపారు.
 మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విధానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి  తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమర్ధిస్తున్నామని వెల్లడించారు. దీనిపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను అభినందిస్తూ ఏకగ్రీవంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామని ప్రకటించారు. అదే విధంగా రామాయపట్నం పోర్టు, రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు, విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు రెండేళ్లుగా విడుదల చేయడం లేదని, వాటి కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామని చెప్పారు. 
 ఇంకా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ, విభజన చట్టంలోని అన్ని అంశాలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని ప్రశ్నిస్తామని ఎంపీ శ్రీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ లోటుపై గతంలో కేంద్రం పేచీ పెట్టిందని, అందువల్ల దాన్ని కూడా ప్రశ్నిస్తామని తెలిపారు. నిజానికి 'కాగ్‌' కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సర్టిఫై చేసిందని, అందువల్ల మన వాదనకు మరింత బలం చేకూరుతుందని చెప్పారు. 
 రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జరగాల్సిన మేలుపై సమావేశంలో సీఎంకు వివరించామని తెలిపారు. ఎంపీల పని తీరు ఏ విధంగా ఉండాలన్న దానితో పాటు, కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సీఎం దిశా, నిర్దేశం చేశారని, రాష్ట్రానికి ఉపయుక్తం అయ్యే ప్రతి అంశాన్ని బాగా అధ్యయనం చేసి, వాటిపై పోరాడాలన్న సీఎం సూచనలను అక్షరాలా పాటిస్తామని చెప్పారు. 
 ఈరోజు వైయస్సార్‌సీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారని అందువల్ల బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని, సభలో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతీసారి ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటామని ఎంపీ శ్రీ పి.మిధున్‌రెడ్డి స్పష్టం చేశారు.
 అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ, వైయస్సార్‌సీపీకి చెందిన 22 మంది లోక్‌సభ సభ్యులు, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎలా ఉండాలనే దానిపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారని చెప్పారు. వైయస్సార్సీపీ లోక్ సభ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీ పి.మిధున్‌రెడ్డి చెప్పినట్లు విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన మాటపై, ఏ సందర్భంలో ఎక్కడ అవకాశం వచ్చినా ప్రస్తావిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధులు తక్షణమే విడుదల చేయాలని, పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించాలని సీఎం సూచించారని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ఏపీకి కూడా కొత్తగా వైద్య కళాశాలలు మంజూరు చేయాలని, ఆ విషయం కూడా సభలో ప్రస్తావిస్తామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే స్పెషల్‌ ఫండ్‌ మన రాష్ట్రానికి రావాల్సి ఉందని, దాని గురించి కూడా సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.
 నవంబరు 14న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించిన 'మనబడి:నాడు–నేడు' కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్‌ సత్యవతి ప్రశంసించారు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటే వారికి చక్కగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సరస్వతీ నిలయాలుగా మారుస్తున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు సమావేశంలో ఎంపీలందరూ ధన్యవాదాలు చెప్పారని డాక్టర్‌ సత్యవతి వివరించారు.