అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 

తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం. 
ఇప్పుడు బళ్ళలో కూడా...!


"డోర్ లాక్ చెయ్యకండి"


'నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో', 'నా కార్ కీస్ ఎక్కడ?'
ఇందులో 'కార్' తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
కానీ మనం వాడం. 
ఎందుకు? 
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. 
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 
తలుపు తాళం వేసుకో, 
గడిపెట్టుకో అనే వాళ్ళం. 
ఇవేకాదు, 
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. 
నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?


మన తెలుగులో మాటలు లేవా? 
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి. 
కానీ మనం పలకం. 


వంటింటిని కిచెన్ చేసాం. 
వసారా వరండాగా మారింది. 
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం. 


మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. 
గెస్ట్‌లే వస్తారు. 
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. 
ఏ లంచో, డిన్నరో చేస్తారు. 
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే. 
అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా,  
వాళ్ళేమనుకుంటారో అని భయం.


అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం. 
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము. 
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. 
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.


టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 
అది ఏ భాషో మీరే చెప్పండి. 
'కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి, 
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, 
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.' ఇలా సాగుతుంది. 
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?


నిన్న మా పక్కింటాయన వచ్చి 
'మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, 
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి' 
అని చెప్పి వెళ్ళాడు. 
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. 
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. 
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై 
కజిన్స్ అయిపోయారు.


పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. 
స్కూల్‍కే పంపిస్తాం. 
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. 
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 


మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం? 
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? 
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి? 
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. 
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, 
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 
ఇతరులు అనుకోవాలన్న భావన.


ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. 


వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం, 
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి. 
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో 
చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది. 
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం 
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి. 
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి. 


ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి. 


ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో 
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి 
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా. 
అతడు కొంచెం వింతగా నావైపు చూసి, 
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు. 
అవునయ్యా అన్నా. 
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది, 
అని అవి అమ్మే చోటు చూపించాడు. 


మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు, 
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది. 


భాషలో లేని పదాలను 
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల 
ఆ భాష పరిపుష్టమౌతుంది. 


అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి 
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. 
ఇంకా సమయం మించిపోలేదు. 
ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు 
అంతరించి పోకుండా ఉండాలంటే 
మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి. 


బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, 
కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. 
అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, 
అచ్చ తెలుగు మాటలకు తలుపులు 


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image