ప్రమాదపు టంచున వింజమూరు బైపాస్ రోడ్ రెయిలింగ్

*ప్రమాదపు టంచున వింజమూరు బైపాస్ రోడ్ రెయిలింగ్ వింజమూరు: వింజమూరు బైపాస్ రోడ్డు పరిస్థితి మూన్నాళ్ళ ముచ్చటగా మారుతున్నది. వింజమూరులో రోజు రోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా యర్రబల్లిపాళెం చెరువు కట్టపై దాదాపుగా 7 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బైపాస్ రోడ్డు వేయడం జరిగింది. అప్పట్లో రోడ్డు కాంఫాక్షన్ పనులు సక్రమంగా జరగలేదనే విమర్శలు కూడా వినిపించాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి ప్రస్తుతం బైపాస్ రోడ్డుకు శాపాలుగా మారాయి. వర్షాలు పడిన సమయంలో చెరువు కట్టకు ఒక వైపున భారీ స్థాయిలో కట్ట భాగం కోతలకు గురైంది. పై నుండి క్రింది వరకు ఏర్పడిన కోతలు భయానక వాతావరణమును కల్పింపజేస్తున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మాణం సుధీర్ఘ కాలం సాగినా దీర్ఘకాలికంగా బైపాస్ రోడ్డు ఉంటుందా అనే అనుమానాలను ప్రయాణీకులు వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట కోతలకు గురవుతుండటంతో రెయిలింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రెయిలింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు కార్యాలయాలను వీడి క్షేత్ర స్థాయిలో పర్యటించి రోజు రోజుకూ దెబ్బతింటున్న వింజమూరు బైపాస్ రోడ్డు పై దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతగా వ్యవహరించకుండా సత్వర చర్యలు చేపట్ట వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు...