'మహా' మలుపు.. ఫడ్నవీస్‌కు గవర్నర్ ఆహ్వానం
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో గత పక్షం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన కీలక మలుపు తిరిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆహ్వానించారు. 288 స్థానాలకు గానూ 105 స్థానాల్లో బీజేపీ గెలిచి అతిపెద్ద పార్టీగా నిలవడంతో గవర్నర్ తొలి అవకాశం ఫడ్నవీస్‌కు ఇచ్చారు. ఈ నెల 11లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఫడ్నవీస్‌కు సూచించారు. ప్రస్తుతం ఫడ్నవీస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే శివసేన మాత్రం కలిసొచ్చేందుకు సుముఖంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. 50:50 ఫార్ములా ప్రకారం సీఎం సీటు కూడా పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది. శివసేన నుంచే సీఎం అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌కు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపడంపై శివసేన ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
మహా’ మలుపు.