తెలుగు” అనే మూడక్షరాలకు అద్భుతమైన నిర్వచనం

“తెలుగు” అనే మూడక్షరాలకు అద్భుతమైన నిర్వచనం
తెలుగు అంటే...
“తెలి తామర తెల్లదనం”
“లుప్తమవని మెత్తదనం”
 “గుణగణాల గొప్పదనం” 
• ఆంగ్ల భాషకు పెద్దపీట వేస్తూనే తెలుగును కాపాడుకోవాలి:
రాష్ట్రఅధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 
•  “తెలుగు భాషని ప్రేమిద్దాం -తెలుగు భాషను కాపాడుదాం” 
: ప్రముఖ సామాజిక సేవకుడు, తెలుగు భాషాభిమాని ఆకుల ఏడుకొండలు
• తెలుగును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత 
: కేంద్ర పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు  
అమరావతి : తల్లి ఒడిలో ఆడుకున్న బాల్యాన్ని ...ఊరిబడిలో దిద్దుకున్న ఓనమాలను మరచిపోలేము...అలాగే అమ్మలాంటి తెలుగు భాషను  ఆదరించడం అందరి బాధ్యత అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు.. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ వద్ద ప్రముఖ సామాజిక సేవకుడు, తెలుగు భాషాభిమాని ఆకుల ఏడుకొండలు రూపొందించిన కరపత్రికను  అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ  ప్రాచీన భాష తెలుగుకు మళ్లీ పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో తెలుగుభాష 2వ స్థానంలో ఉందన్నారు. ఆంగ్ల భాషతో పాటు తెలుగు కు సరైన ప్రాధాన్యత కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఆవశ్యకతను ఆయన వివరించారు. మాతృభాషకు సరైన గౌరవం దక్కేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచమంతా తెలుగు భాషను కీర్తిస్తున్నారన్నారు. ఎందరో మహానుభావులు తెలుగు భాషకు ఊపిరి పోశారని గుర్తుచేశారు. తెలుగువారమైన మనం తెలుగు భాషను అన్ని దిశల్లో ఉండాలా ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష కోసం ఏడుకొండలు చేస్తున్న కృషిని కొనియాడారు. తెలుగు అనే మూడక్షరాలకు సంబంధించిన కరపత్రికను చదివి వినిపించారు. “తె అంటే తెలి తామర తెల్లదనం”, “లు అంటే లుప్తమవని మెత్తదనం”, గు అంటే “గుణగణాల గొప్పదనం” అని ప్రముఖ సామాజిక సేవకుడు, తెలుగు భాషాభిమాని ఆకుల ఏడుకొండలు రూపొందించిన కరపత్రికను చదవి వినిపించి అభినందించారు. “తెలుగు భాషని ప్రేమిద్దాం-తెలుగు భాషను కాపాడుదాం”అంటూ ఏడుకొండలు ఇచ్చిన నినాదానికి తమ వంతుగా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష మీద మక్కువతో తన అభిమానాన్ని చాటుకున్న ఏడుకొండలుని యార్లగడ్డ ప్రత్యేకంగా అభినందించారు.  మాతృభాష నిర్వచనాన్ని తెలియజేస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా కరపత్రాన్ని విడుదల చేయడం గొప్ప విషయమని ప్రముఖ సామాజిక సేవకుడు, తెలుగు భాషాభిమాని ఆకుల ఏడుకొండలు అన్నారు. ఆధునిక సమాజంలో ఆంగ్లభాషను వినియోగించుకుంటూనే మాతృభాషను విడనాడవద్దని సూచించారు. 
కేంద్ర పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు  మాట్లాడుతూ తెలుగు భాష తియ్యనైనది.... వింటుంటే మధురంగా ఉంటుంది.... చదువుతుంటే నవరసాలు తొణికిసలాడుతాయన్నారు. గత రెండు దశాబ్ధాలుగా తెలుగు భాష కోసం మరియు 270కి పైగా ఆధ్యాత్మిక, ధార్మిక సామాజిక కార్యక్రమాలు చేసిన ఏడుకొండలు కృషి మరవలేనిదన్నారు.  అనేక దేవాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటుతూ ప్రకృతిపై తన అభిమానాన్ని చాటుకున్నారన్నారు. చిన్నపిల్లలకు దంత, కంటి, వినికిడి,హోమియో, ఆయుర్వేదం వంటి  విషయాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి సామాజిక సేవ చేశారన్నారు.  అంతేగాక పేద విద్యార్థులకు  పుస్తకాలు, ఏకరూపదుస్తులు అందించారన్నారు. అంగన్ వాడీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారన్నారు. భావిభారత పౌరులు,  భారతావని బాలబాలికలకు పోషకలోపం ఉండొద్దనే ఉద్దేశంతో “నేను సైతం”వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తన సామాజిక స్పృహను చాటుకున్నారన్నారు.