*పారిశుధ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి* (హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్)
వింజమూరు: గ్రామాలలో పారిశుద్ద్య్హం మెరుగుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కృషి చేయాల్సిన భాధ్యత అత్యంత ఆవశ్యకమని హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్ సూచించారు. శుక్రవారం నుండి మండలంలో ప్రారంభమైన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా వింజమూరులోని రాజీవ్ నగర్, చాకలికొండ గ్రామంలో పారిశుధ్య చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీబీజాన్ ప్రజలకు పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించారు. నివాస గృహాల సముదాయంలో నిల్వ ఉండే నీటిని ఉంచరాదని, స్థానికంగా పేడ దిబ్బలను తొలగించాలని, వ్యాధులకు కారకాలయ్యే పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. కేవలం పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన జీవన విధానం సాధ్యపడుతుందన్నారు. దోమల ఉత్పత్తికి మురికి కూపాలే ప్రధాన కేంద్రాలని, కనుక నివాసాలు, అంతర్గత రోడ్లుపై ఎప్పటికప్పుడు వీటిని తొలగించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, క్షయ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నివారించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు గురించి స్థానిక ప్రజలకు వివరించారు. వీధులలో తిరుగుతూ లార్వా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైధ్యారోగ్యశాఖ సిబ్బంది హరిక్రిష్ణ, గిరి కుమారి, వెంకటేశ్వర్లు రెడ్డి, రాజేశ్వరి, షఫి, ప్రభావతి, వెంకటేశ్వర్లు, అరుణారాణి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు...