తేది 05-11-2019
భారతరత్న అబ్దుల్ కలాం గారిని అవమానించినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలి..
- నాదేండ్ల బ్రహ్మం
విజయవాడ :
మాజీ రాష్ట్రపతి, భారత రత్న స్వర్గీయ డా|| ఏ.పి.జే అబ్దుల్ కలాం పేరును పథకం నుంచి తొలగించి తన తండ్రి పేరు పెట్టుకోవడంతోనే జగన్మోహన్‌రెడ్డికి దేశ నాయకుల మీద ఏంత ప్రేమ ఉందో అర్ధం అవుతుంది. ఈ విషయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి ప్లేట్ ఫిరాయించి పేరు మార్పుపై నాకు తెలియదని బుకాయిస్తున్నారు. జీవో నెం. 78 గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈ నాటకాలు. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా జీవో ఎక్కడైనా విడుదల అవుతుందా? పాలనలో ఏం జరుగుతుందో, ఏ జీవోలు ఇస్తున్నారో కూడా ముఖ్యమంత్రికి తెలియదా..? 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు చంద్రబాబు నాయుడు గారు హాయాంలో డా|| ఏ.పి.జే. అబ్దుల్ కలాం స్పూర్తిగా అందించే ప్రతిభ అవార్డును అందించేవారు. ఆ పేరును వైఎస్ ప్రతిభా పురష్కారంగా మారుస్తూ ప్రభుత్వం జీవోలిచ్చి అబ్దుల్ కలాం గారిని అవమాన పరిచింది. ఈ విషయం పట్ల రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలి.
అత్యున్నత సీఎస్ స్థానంలో ఉన్న వ్యక్తిని కింద స్థాయి అధికారి తొలగించటం దేశంలో ఎక్కడైనా చూశామా? అది ఒక్క జగన్ పాలనలో సాధ్యమని నిరూపించారు. పబ్లిక్ పార్కులో ఉన్న విగ్రహాలను తొలగించి తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏకంగా దేవుడు మందిరాన్ని తొలగించి అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుకు యత్నించారు. ఏకంగా మహాత్ముల పేర్ల తొలగింపునకు శ్రీకారం చుట్టడం దుర్మార్గానికి నిదర్శనం. జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యనే కాదు.. శాఖల మధ్యనా సమన్వయం లేకపోవడం విడ్డూరంగా ఉంది.
నాదేండ్ల బ్రహ్మం
టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు