హిందూ సంప్రదాయాలను కాలరాయడమే వైసీపీ ధ్యేయమా..?

తేది 18-11-2019


 


ప్రజాప్రతినిధులైన మంత్రుల మాటల్లో.. ఆ హుందాతనం ఏది?


దేవుళ్లపై భక్తి లేదు, పెద్దలపట్ల మర్యాద లేదు..


హిందూ సంప్రదాయాలను కాలరాయడమే వైసీపీ ధ్యేయమా..?


         - వేమూరి ఆనంద సూర్య 


 ఎన్నికలలో ప్రజాభిప్రాయం మేరకు గెలిచి పదవులు అనుభవిస్తున్న మంత్రులు.. సంస్కృతి సంప్రదాయాలను సమంగా గౌరవించాలనే ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ  ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి గురించి ఆది నుంచి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తిరుమలను సందర్శించే అన్యమతస్తులు డిక్లరేషన్‌ ఇచ్చి ఆలయాల్లోకి వెళ్లాలనే  నిబంధన ఉన్నా.. జగన్‌ పాటించలేదనే విమర్శకి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని స్పందించిన విధానం చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార సాంప్రదాయాల గూర్చి, హిందూ భక్తుల మనోభావాల గూర్చి మంత్రి వ్యాఖ్యలు  హేయం. హుందాగా నడుచుకోవాల్సిన మంత్రులు సహనం కోల్పోయి మాట తూలడం సిగ్గుచేటు. ఒక మంత్రి అయ్యప్ప మాల వేసుకుని చెప్పులతో నడుస్తారు, ఇంకొక ఎమ్మెల్యే మాలలో ఉండి నోటికి వచ్చిన బూతులు మాట్లాడతారు. వైసీపీ నేతల చర్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. తిరుమలలోని గదుల అద్దెలు, లడ్డూ ధరలు పెంచడంలోని ఆంతర్యం ఏమిటి..? భక్తులను తగ్గించాలనా! లేక మీ ఆదాయాన్ని పెంచుకోవాలనా..? పాదయాత్రలో, ప్రమాణ స్వీకారంలో బ్రాహ్మణుల ఆశీస్సులు పొందిన మీరు.. ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇప్పటికే కోపోద్రిక్తులై ఉన్న బ్రాహ్మణుల ఆశీస్సులు మీకు శాపాలుగా మారక తప్పదు. ఇప్పటికైనా మీ వ్యవహారశైలి మారకుంటే హిందువులందరూ సంఘటితమై పోరాటానికి దిగిన రోజున.. మీరు మీ ప్రభుత్వం కనుమరుగవ్వడం ఖాయం.             Sd/-


         (వేమూరి ఆనందసూర్య)                బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌