పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
పట్టణాల్లో మొదటి దశలో 1,24,624 ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం
పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం
మున్సిపాలిటీల్లో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.50 లక్షలు
పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రూ.2 లక్షలు
అమరావతి : పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రతిపాదన లకు ఆమోదం లభించింది. నవరత్నాలు, పీఎం ఆవాస్ యోజన కింద తొలిదశలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనలను ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.50 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయి. ఇదే రీతిలో తరువాతి దశల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనేది ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు అన్నవారు లేకుండా అందరికీ సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలను ఉగాది పండుగ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకు సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల కింద ఆర్థిక సహాయం అందజేసేలా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్) రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, నిధులు సమీకరిద్దామని చెప్పారు. నవరత్నాల పథకాలు, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ దీనిపై కసరత్తు చేసింది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పేదలకు గృహ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. రాష్ట్రంలో మొదటి దశలో 85 ప్రాజెక్టుల కింద రూ.3 వేల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదించిన తరువాత ఆ నివేదిను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు సమర్పించారు.
తొలిదశలో 1,24,624 ఇళ్లకు ఆమోదం : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పట్టణాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన సెంట్రల్ శాంక్షన్ మానిటరింగ్ కమిటీ(సీఎస్‌ఎంసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. పట్టణ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారం నవరత్నాల పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,870 కోట్ల గ్రాంటును రాష్ట్రానికి కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా కలిపి లబ్ధిదారులకు అందజేస్తుంది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర పట్టణగృహ నిర్మాణ సంస్థ ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది.గృహ నిర్మాణాలను పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఇళ్లు కట్టుకోడానికి ఇదే రీతిలో ఆర్థిక సహాయం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకోసం ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం