ఆర్టీసీని విలీనం చేసేది లేదు : సీఎం కేసీఆర్‌

ఆర్టీసీ సమ్మె : తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
ఆర్టీసీని విలీనం చేసేది లేదు : సీఎం కేసీఆర్‌
 హైదరాబాద్‌ : తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మీడియాతో అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్‌ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీతో రూ.975 కోట్ల ఆదాయం కలిసి వచ్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'చరిత్ర ఎవరూ చెరపలేరు. చావు దాకా వెళ్లి వచ్చిన. తెలంగాణ అంటే అమితమైన అభిమానం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే తీసుకుంటాం'అన్నారు.
2100 బస్సులు మూలకు : 5100 బస్సు రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. అంతులేని కోరికతో ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వ లో విలీనం చేయబోయేది లేదని కేసీఆర్‌ మరోసారి ఉద్ఘాటించారు. ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2100 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని చెప్పారు.  చర్చల మధ్యలో సమ్మెకు వెళ్లొద్దని కేసీఆర్‌ స్పష్టం చేశారు.