శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే ఇది నేరుగా వారి అకౌంట్‌లో జమ అవుతుందని తెలిపారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ఏడాదికి రూ. 268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ ప్రమాణం చేయించారు. స్పందన కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను సీఎం వైఎస్ జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైఎస్సార్ నవశకంపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని.. డిసెంబర్ 20 నాటికి ఇందుకు సంబంధించిన తుది జాబితాను ప్రదర్శించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్స్‌ను వారానికి రెండు దఫాలు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3న వరల్డ్ డిసేబుల్డ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే డిసెంబర్ 15వ తేదీ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
మత్య్సకారులకు డిసెంబర్ 15వరకు అవకాశం : వైఎస్సార్ వాహనమిత్ర కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులందరికీ నేటితో చెల్లింపులు పూర్తి చేశామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్‌షాపులపై కలెక్టర్లు సీరియస్ దృష్టి సారించాలని సూచించారు. ధాన్యం సేకరణ, రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారికి డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
చేనేత కుటుంబాలకు కింద రూ. 24వేలు : డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ. 24వేల సాయం అందిచనున్నట్టు తెలిపారు. ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం మార్చి 1 కటాఫ్ తేదీగా లబ్దిదారుల జాబితాను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. జనవరి 1 నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వేతనాల చెల్లింపు జరుగుతాయని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి ఈ జాబితాను సిద్దం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయిలో ఇసుక ధరలు, లభ్యతపై ప్రతివారం పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటి జీపీఎస్ తప్పనిసరి చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను ఆరికట్టేందకు డిసెంబర్ 10 నాటికి 439 చెక్‌పోస్ట్‌లలో నైట్ విజన్ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలని.. దీనిపై ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఒక్క ఫోన్ కాల్‌తో అవినీతిపరుల భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటివరకు 92 శాతం చెక్కుల పంపిణీ జరిగిందని.. వచ్చే సమావేశం నాటి నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం