అప్రమత్తతతోనే మహిళలకు రక్షణ 

అప్రమత్తతతోనే మహిళలకు రక్షణ 
-వైబ్రాంట్స్ ఆఫ్ అబ్దుల్ కలాం సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు   
 జగ్గయ్యపేట,  డిసెంబర్ 9.    (అంతిమ తీర్పు) :   మహిళల రక్షణకు అందుబాటులో ఉన్న సదుపాయాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని జగ్గయ్యపేట ఎస్. ఐ  ఆర్. ధర్మరాజు, చిల్లకల్లు ఎస్.ఐ బానవత్ అభిమన్యు సూచించారు.  
వైబ్రాంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో  విశ్వభారతి డిగ్రీ కళాశాల, జగ్గయ్యపేట జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం నాడు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎస్.ఐలు ఆర్.ధర్మరాజు, బానవత్ అభిమన్యు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల రక్షణకు పోలీసు శాఖ 100ను అందుబాటులో ఉంచారని చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సదుపాయాలతో పాటు సమస్యలూ ఎదురవుతున్నాయని అన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పట్ల కూడా అవగాహన, అప్రమత్తత అవసరమని వారు సూచించారు. బాలికలు, మహిళలు ఎటువంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అప్పుడే నేరాలను అదుపు చేయగలుగుతామని వారు తెలిపారు. మహిళల రక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వైబ్రాంట్స్ ఆఫ్ అబ్దుల్ కలాం కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ వుల్లూరి శ్రీలలితను వారు అభినందించారు.   
 కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు కె.యన్. రమేష్, జె. తిరుపతిరావు, బిజెపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి  షేక్ ఖాజా అలి, చేనేత విభాగం నాయకులు  వాసా పల్లపురాజు, కొడాలి అపర్ణ, కల్లూరి శ్రీవాణి తదితరులు ప్రసంగించారు.