అధునాతనంగా 108

అధునాతనంగా 108
అందుబాటులోకి వస్తున్న 750 అంబులెన్స్‌లు
మండలానికి ఒకటి చొప్పున కేటాయింపు
సంచార వైద్యశాలలకు 676 కొత్త వాహనాలు
ఏప్రిల్‌ నుంచి మెరుగుపరచిన సేవలు
-అమరావతి
అధునాతనంగా 108
అత్యవసర సేవల(108), గ్రామీణ వైద్య సేవల అంబులెన్సు(104)ల సేవలు మరింత అధునాతనంగా ప్రజలకు చేరువ కాబోతున్నాయి. బాధితులకు నాణ్యమైన సేవలు అందే విధంగా అంబులెన్స్‌ల్లో అత్యాధునిక పరికరాలు మరికొన్నింటిని అదనంగా చేరుస్తున్నారు. ఇక నుంచి ఒకే సంస్థ ద్వారా కాకుండా అత్యవసర స్పందన కేంద్రం (కాల్‌ సెంటర్‌), అంబులెన్సుల నిర్వహణ వేర్వేరు సంస్థల ద్వారా జరగబోతుంది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆధునికీకరించిన కొత్త సేవలు ఏప్రిల్‌ నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.
25 శాతం అంబులెన్సుల్లో వెంటిలేటర్లు!
108, 104 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ‘అరబిందో ఫార్మా ఫౌండేషన్‌’ దక్కించుకుంది. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒకటి వంతున 108 అంబులెన్సులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా వచ్చే 750 అంబులెన్సుల్లో 432 కొత్తవి. 25% అంబులెన్సుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగికి ఉపయోగపడే వెంటిలేటర్‌, గుండెపోటు వచ్చినప్పుడు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తినపుడు అత్యవసరంగా వైద్యం అందించేందుకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచబోతున్నారు. చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటిలేటర్‌, ఇంక్యుబేటర్‌, ఇతర సౌకర్యాలు కలిగిన రెండు అంబులెన్సులను జిల్లాకు రెండు చొప్పున (26) ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణాల్లో 15..గ్రామాల్లో 20 నిమిషాల్లో..
అత్యవసర స్పందన కేంద్రానికి ఫోన్‌ వచ్చినప్పటి నుంచి పట్టణాలు/నగరాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లోగా సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫోన్‌ ద్వారా సమాచారాన్ని తీసుకోవడం, వాహనాలకు సమాచారాన్ని పంపడం ఒక ఉద్యోగి ద్వారానే జరుగుతోంది. దీనివల్ల సమయం వృథా అవుతోంది. కొత్త విధానంలో మరొకరిని అదనంగా నియమిస్తున్నారు. దీనివల్ల సమయం ఆదా జరిగి ప్రమాదంలో ఉన్న వారికి వైద్య సేవలు సకాలంలో అందుతాయి. ‘మొబైల్‌ డివైజ్‌ టెర్మినల్‌ ట్యాబ్‌’ ద్వారా అంబులెన్సుల రాకపోకలు, రోగులకు అందే వైద్య సేవలను పర్యవేక్షించనున్నారు. అనుభవాన్ని అనుసరించి 108 పైలట్లకు గరిష్ఠంగా నెలకు రూ.28,000, సాంకేతిక నిపుణుడికి రూ.30,000 వరకు చెల్లింపులు జరుగుతాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ
104 సంచార వైద్యశాలల కింద 676 కొత్త అంబులెన్సులు రాబోతున్నాయి. ప్రస్తుతం 270 వాహనాలు నడుపుతున్నారు. ప్రతి వాహనం నెలకు ఒకసారి ఒక్కో గ్రామానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానికులకు వైద్య సేవలను అందిస్తుంది.
విశ్వాసాన్ని పెంచేలా సేవలు
108 అంబులెన్సుల సేవల తీరుపై విశ్వాసాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. జీవనశైలి వ్యాధులు రాకుండా ఉండేలా 104 సంచార వైద్యశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెరుగుతాయి. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల నిర్వహణకు సుమారు ప్రతి ఏడాది రూ.350 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. 108, 104 వాహనాల కొనుగోలు, పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.1,300 కోట్ల వరకు వ్యయమవుతోంది.


- వెంకట్‌ చంగవల్లి, 108, 104 సేవల ప్రభుత్వ సలహాదారు