*తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి* (వై.సి.పి మండల కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి)
వింజమూరు: (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో ప్రస్తుత వేసవి కాలమును దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించి తద్వారా అవసరమైన చర్యలకు ఉపక్రమించాలని మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ఫోస్టాఫీసు వీధిలో ఉన్న ప్రజల విజ్ఞప్తి మేరకు యం.పి.డి.ఓ కార్యాలయానికి వెళ్ళి సీనియర్ అసిస్టెంట్ చాంద్ భాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మండలంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. గతేడాది తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సాగునీటి వనరులు మృగ్యం కావడంతో రైతు కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. గతంలో తాగునీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా జరిగినప్పటికీ పశువులకు కొద్ది మోతాదులోనే నీరందించడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఎండలు తీవ్రరూపం దాలుస్తుండటంతో నీటికి గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని ఆందోళన చెందారు. తాగునీటి ఎద్దడిని నివారించే లక్ష్యాలలో భాగంగా గ్రామాల వారీగా ప్రజలను బేరీజు వేయడమే కాక పశుపక్ష్యాదులను కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా సాధ్యమైనంత మేరకు నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనుక అధికారులు ప్రజలకు సమృద్దిగా తాగునీటిని అందించేందుకు ఇప్పటి నుండే నిర్ధిష్టమైన ప్రణాళికలను నివేదికల రూపంలో సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపిచాల్సి ఉందని తిప్పిరెడ్డి.నారపరెడ్డి పేర్కొన్నారు.