దేశవ్యాప్తంగా నో సినిమా షూటింగ్స్‌


హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు వినోద రంగానికి చెందిన సినిమా, టీవీ సీరియల్స్‌, డిజిటల్‌ షో ల షూటింగ్‌ను ఆపేయాలని దాదాపు అన్ని చిత్ర పరిశ్రమలు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అదే బాటలో పయనిస్తోంది. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్‌ నిలిపివేస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ వెల్లడించారు. ఆదివారం ఫిల్మ్ ఛాంబర్‌లో 24 విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీలు దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, నట్టి కుమార్, ఠాగూర్‌ మధు, రామా సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారాయణ దాస్ నారంగ్‌ మాట్లాడుతూ.. ‘తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ, ఆంధ్రా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందరూ దీనికి సహకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘కొందరు నిర్మాతలకు ఇబ్బంది ఉన్నా సరే మా నిర్ణయానికి అందరూ సహకరించాలి’ అని బెనర్జీ అన్నారు.
‘థియేటర్స్ బంద్‌తోపాటు, షూటింగ్ కూడా నిలిపివేయాలని భావించాం. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరంలేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’ అని సి. కల్యాణ్‌ తెలిపారు. అనంతరం జీవిత రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం కలిసి దీన్ని సమర్థిస్తున్నాం. షూటింగ్స్ సమయంలో వందల మంది పాల్గొంటారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు.
దేశవ్యాప్తంగా నో సినిమా షూటింగ్స్‌!
మార్చి 19 నుంచి 31 వరకు చిత్రీకరణను ఆపేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐఎమ్‌పీపీఏ), ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ), ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీడీఏ), వెస్ట్రన్‌ ఇండియా ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూఎఫ్‌పీఏ) సమావేశం అయ్యాయి. ఆయా సంఘాలకు చెందిన అధ్యక్షులు, సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు.