కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

*కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..* వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు....


వింజమూరు (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): లాక్ డౌన్ ను ఆసరాగా తీసుకుని నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించి వ్యాపారులు ధరలు పెంచితే కఠిన చర్యలలో భాగంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం తెల్లవారుజాము నుండే కూరగాయలు, పాలు, మెడికల్ షాపుల దుకాణాల వద్ద పరిశీలించారు. పాల డిపోలు, మెడికల్ షాపుల కేంద్రాలలో ధరలు షరామామూలుగానే ఉంటుండగా కూరగాయల ధరలలో మాత్రం వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి తహసిల్ధారు ప్రత్యేక చొరవ తీసుకుని కూరగాయల అంగళ్ళ వద్ద రోజువారీ ధరలను తమ డైరీలో నమోదు చేసుకుంటూ వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ధరల నియంత్రణను పాటించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంగళ్ళ ముందు భాగంలో వినియోగదారులు గుంపులు గుంపులుగా ఉండనీయకుండా వ్యాపారులే తగిన సూచనలు ఇవ్వాలన్నారు. వినియోగదారులు కూడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వ్యక్తుల మధ్య సమదూరం పాటించాలని తహసిల్ధారు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత గడువు లోపే అటు వ్యాపారులు, ఇటు ప్రజలు ఒక్కొక్కరుగా వచ్చి పనులు ముగించుకున్న అనంతరం వారి వారి నివాసాలకు వెళ్ళిపోవాలన్నారు. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వాల నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.