ఆబ్కారీ శాఖలో రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖలో రూ.4500 కోట్లు ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం

 


తేది: 17.04.2020
అమరావతి


ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యం


ఆబ్కారీ శాఖలో రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖలో రూ.4500 కోట్లు ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం 


ప్రజారోగ్యానికే ప్రభుత్వం పెద్దపీట


• మద్యం అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు


• అన్ని బార్లు, షాపుల్లో స్టాక్ ను  తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశం


• సత్ఫలితాలిస్తోన్న గ్రామ,వార్డు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ: అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి


అమరావతి, 17 ఏప్రిల్: ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో ఎక్సైజ్ శాఖాధికారులతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం ఆబ్కారీ శాఖ పరంగా రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖ పరంగా రూ.4500 కోట్లు మొత్తం రూ.6000 కోట్లు నష్టపోయిందని వివరించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వానికి ఆదాయానికన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. ముందస్తు ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోందని, దీన్ని యావత్ ప్రపంచం కొనియాడుతుందని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తెలిపారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రిని పలువురు ప్రశంసించారని గుర్తుచేశారు. లాక్ డౌన్ సమయంలో ఆయా వ్యవస్థలు నిర్వహిస్తున్న బాధ్యతలే అందుకు నిదర్శనమని వెల్లడించారు.  


లాక్ డౌన్ సమయంలో చాలా చోట్ల బార్లకు సంబంధించిన స్టాక్ ను బయట అధికరేట్లకు అమ్ముతున్నారన్న వార్తల నేపథ్యంలో అన్ని బార్లలో, షాపుల్లో స్టాక్ ను తనిఖీ విస్తృతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలకు ఆదేశిస్తామన్నారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.  


లాక్ డౌన్ సమయంలో 2791 కేసులు, 2849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. సుమారు 22 వేల లీటర్ల ఐడీని సీజ్ చేశామని వెల్లడించారు. 2100 కేసులు ఐఎమ్ఎల్, 1500 కేసులు బీర్లు, 1457 కేసులు ఎన్డీపీఎల్ సీజ్ చేశామన్నారు. అదే విధంగా 665 వెహికిల్స్ ను సీజ్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించామన్నారు. ఐడీని నియంత్రించేందుకు పీడీ కేసులు కూడా పెట్టమని చెప్పామన్నారు. బార్లలో అవకతవకలు జరిగితే బార్ లైసెన్స్ రద్దు చేయడానికైనా వెనకాడబోమన్నారు. అదే విధంగా బైండ్ ఓవర్ అమౌంట్ ను పెంచామని చెప్పామన్నారు.  బార్లలో దొంగతనంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన కథనాల్లో వాస్తవం ఉందని, తమ దృష్టికి రాగానే వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు కలిసి విచారణ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఒక సీఐని, ముగ్గురు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వివరించారు. శాఖాపరమైన విచారణ చేసిన అనంతరం అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఉద్యోగాలు తొలగించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోడనే సామెతను గుర్తుచేస్తూ అలాంటి వారెవరైనా శాఖలో ఉంటే సహించబోమని హెచ్చరించారు.  


ఏది ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలు తపన పడుతున్నారని ఉపముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ ఖజానా లోటులో ఉన్నప్పటికీ  ప్రజలకు సాయం చేయడంలో తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్  లాంటి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల బాగోగులను ఆలోచించి ఒకే నెలలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నామన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దైవసమానుడిగా, దేవుడి పుత్రుడిగా, ప్రజల సేవకుడిగా అభినందిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈ సమయంలో కొందరు పనిగట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని కరోనాపై నిర్మాణాత్మక సలహాలు, సూచనలిస్తే స్వీకరిస్తామన్నారు. 


సమావేశంలో సెక్రటరీ పీయూష్ కుమార్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్ లాల్, ఏపీఎస్పీసీఎల్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.