జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు హెచ్చ‌రిక‌

జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు హెచ్చ‌రిక‌
              జ‌ర్న‌లిస్టు మిత్రులారా కోవిడ్ హాస్పిట‌ల్‌, హాస్పిట‌ల్ క్వారంటైన్‌ల‌కు ఎవ‌రూ వెళ్ల‌కండి. ఇప్ప‌టికే మూడు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ముంబైలో ఓ చాన‌ల్‌లో ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టులంద‌రికీ క‌రోనా సోకింది. జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలితే ఏ ప్ర‌భుత్వ‌మూ, యాజ‌మాన్య‌మూ ఆదుకోవు. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వాలు ప్యాకేజీలు ప్ర‌క‌టించాయి. జ‌ర్న‌లిస్టుల‌కు మాత్రం ప్ర‌త్యేకంగా ఏమీ ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌క‌టిస్తార‌ని కూడా ఆశ‌లేదు. కావున క‌రోనాకు గురి కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఒక్క‌టే ప‌రిష్కారం" అని రెండురోజులుగా సోష‌ల్ మీడియాలో బాగా చ‌క్క‌ర్లు కొడుతున్న అంశ‌మిది.
తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా తేల‌డం, అలాగే ముంబైలో రిపోర్ట‌ర్లు, కెమెరామెన్ల‌ను క‌లుపుకుని మొత్తం 53 మందికి క‌రోనా సోకింది. తెలంగాణ‌లో కూడా ప్ర‌ముఖ న్యూస్ చాన‌ళ్ల రిపోర్ట‌ర్లు, కెమెరామెన్లు, వారి కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అనే వార్త‌లొచ్చాయి.
ఈ నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్టులుగా తామెందుకు క‌రోనా పాజిటివ్ బాధితుల ద‌గ్గ‌రికి వెళ్లి, కోరి కోరి జ‌బ్బు తెచ్చుకోవాల‌నే ఆలోచ‌న మొద‌లైంది. అంతేకాదు, గ‌తంతో పోలిస్తే అస‌లు జ‌ర్న‌లిజం అనేదే లేద‌ని చెప్పొచ్చు. ఒక ప్ర‌ముఖుడి మాట‌ల్లో చెప్పాలంటే...మీడియా ఫోర్త్ ఎస్టేట్ కాదు రియ‌ల్ ఎస్టేట్‌. మీడియాలో ప్ర‌స్తుత ధోర‌ణ‌లు చూస్తుంటే ఇది ఎంత చేదు నిజ‌మో క‌దా అనిపిస్తుంది. రియ‌ట్ ఎస్టేట్‌లో నిల‌దొక్కుకోగ‌లిగితేనే...ఫోర్త్ ఎస్టేట్‌లో నిల‌దొక్కుకునే ప‌రిస్థితులు దాపురించాయి.
జ‌ర్న‌లిస్టుల బ‌తుకులు వ‌ల‌స కూలీల‌కు ఎక్కువ‌, ఉపాధి కూలీల‌కు త‌క్కువ. కేవ‌లం జ‌ర్న‌లిజాన్నే ఉపాధి చేసుకున్న వాళ్ల కుటుంబాలకు పూట‌గ‌డ‌వ‌ని స్థితి. మ‌రికొంద‌రు మీడియా రంగంలో ఉద్యోగులుగా స్థిర‌ప‌డిన‌ప్ప‌టికీ....మిగిలిన రంగాల‌తో పోలిస్తే జీత‌భ‌త్యాల్లో న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా. జ‌ర్న‌లిజంలో 30 ఏళ్లు సేవ చేసినా  జీతం (ఈనాడు మిన‌హా) రూ.20 వేల‌కు కూడా చేర‌ని దుర్మార్త‌మైన రంగం ఇది.
చాలా మంది రిటైర్డ్ అయ్యే నాటికి కూడా రూ.20 -22 వేల‌కు మించి తీసుకున్న వాళ్లు లేరు. జ‌ర్న‌లిజం అనేది ఓ మ‌త్తు. ఆ ఊబిలోకి దిగితే బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్టం. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా న‌డివ‌య‌స్సులో ఉద్యోగాలు పోగొట్టుకున్న జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి అగమ్యం.
ఆంధ్ర‌జ్యోతిలో ఉద్యోగుల‌ను తొల‌గించినా, ఉన్న‌వాళ్ల వేత‌నాల్లో 20 శాతం కోత విధించినా, అలాగే ఈనాడులో  ఉద్యోగుల‌ను జీతం లేని దీర్ఘ‌కాలిక సెల‌వుపై ఇళ్ల‌కు పంపినా...వాటి ప్ర‌త్య‌ర్థి ప‌త్రిక సాక్షి ఒక్క అక్ష‌రం కూడా రాయ‌దు. ఎందుకంటే సాక్షి కూడా త‌న ఉద్యోగుల మెడ‌పై గిలిట‌న్ (ఫ్రెంచి విప్ల‌వ కాలంలో ప్రాచుర్యంలోకి వ‌చ్చిన త‌ల న‌రికే యంత్రం) వేలాడ‌దీస్తోంది.  
ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ క‌రోనా క‌ట్ట‌డికి కొన్ని రంగాల ప్ర‌ముఖుల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మీడియా రంగానికి సంబంధించిన ప్ర‌ముఖుల నుంచి కూడా ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. ఇక్క‌డ జ‌ర్న‌లిస్టులు బాగా గుర్తించాల్సిన విష‌యం ఒక‌టి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు.
రామోజీ, ఆర్‌కే ఎవ‌రు?  మీడియా సంస్థ‌ల అధిప‌తులు. ఈనాడు చీఫ్ ఎడిట‌ర్‌గా రామోజీ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లు త‌మ ఎడిట‌ర్ల‌ను ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌కు ఎందుకు పంప‌లేదు? జ‌ర్న‌లిస్టులంటే గొప్ప మేధావుల‌మ‌ని విర్ర‌వీగే మ‌నం ఎప్పుడైనా ఆ విష‌య‌మై ఒక్క క్ష‌ణ‌మైనా ఆలోచించామా? ఆలోచించ‌లేదు, ఆలోచించం కూడా. ఎందుకంటే దేశాన్ని ఉద్ధ‌రించే రంగంలో ఉన్నామ‌నే మాయ‌లో మ‌న గురించి మ‌నం, మ‌న కుటుంబ గురించి ఏనాడూ ఆలోచించ‌డానికి ఇష్ట‌ప‌డం.
అందుకే ప‌త్రికా యాజ‌మాన్యాల‌కు జ‌ర్న‌లిస్టులంటే అంత చుల‌క‌న‌. త‌మ వ‌ల్లే జ‌ర్న‌లిస్టులు బ‌తికిపోతున్నార‌ని ప‌త్రికా యాజ‌మాన్యాలు భావిస్తుండ‌టం వ‌ల్లే ఎడిట‌ర్ మొద‌లుకుని మండ‌ల స్థాయి విలేక‌రి వ‌రకు ...ఎవ‌ర్నీ మీడియా యాజ‌మాన్యాలు లెక్క‌పెట్ట‌వు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌కు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లు త‌మ ఎడిట‌ర్ల‌ను పంప‌క పోవ‌డ‌మే.
ఇక్క‌డో విష‌యం చెప్పుకోవాలి. కేఎన్‌వై ప‌తంజ‌లి అని ఓ గొప్ప ర‌చ‌యిత‌, సంపాద‌కుడి పేరు వినే ఉంటారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, సంపాద‌కుడు అయిన ప‌తంజ‌లి బ‌తక‌డం కోసం ప‌చ్చ‌ళ్లు చేసి హైద‌రాబాద్ న‌గ‌ర వీధుల్లో అమ్ముకోవాల్సి వ‌చ్చింది. ఎడిట‌ర్ల ప‌రిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక కిందిస్థాయి జ‌ర్న‌లిస్టుల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించ‌లేం. ఆయ‌న ఇప్పుడు మ‌న మ‌ధ్య లేరు. 1983లోనే ఆయ‌న పెంపుడు జంతువులు అనే ఓ న‌వ‌ల రాశారు. ఇది పూర్తిగా జ‌ర్న‌లిస్టుల గురించి రాసిందే. ఈ న‌వ‌ల‌లో ఎడిట‌ర్ పాత్ర గురించి ప‌తంజ‌లి అద్భుతంగా చెబుతారు. ఏమ‌ని అంటే...ఎడిట‌ర్‌కు ఎడిట‌ర్ ఉద్యోగం కావాలే త‌ప్ప‌, ప‌త్రిక‌ల‌కు ఎడిట‌ర్ అవ‌స‌రం లేద‌ని. ఎందుకంటే ఎప్పుడైతే ప‌త్రిక‌ల్లో వాణిజ్య రంగానిది పైచేయి అయ్యిందో అప్పుడే ప‌త్రిక‌లు చ‌చ్చిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారాయ‌న‌.
ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ కె.శ్రీ‌నివాస్ ఎంత గొప్ప జ‌ర్న‌లిస్టు మ‌నంద‌రికీ తెలుసు. కె.శ్రీ‌నివాస్‌కు సాహిత్యంతో స‌మాజ ప‌రిణామ క్ర‌మంపై లోతైన అవ‌గాహ‌న ఉంది. క‌రోనా అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఇటీవ‌ల ఆయ‌న అద్భుత‌మైన వ్యాసం రాశారు. అలాగే క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయాలో ఆయ‌న ద‌గ్గ‌ర మాస్ట‌ర్ ప్లాన్ ఉండే ఉంటుంది. క‌రోనా విప‌త్తులో సామాన్య జ‌నం ఇక్క‌ట్ల గురించి ఆయ‌న‌కు బాగా తెలుసు. ప్ర‌ధానితో కె.శ్రీ‌నివాస్ లాంటి ఎడిట‌ర్లు మాట్లాడితే స‌మాజానికి మంచి జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌. కానీ ఆయ‌న‌తో మాట్లాడించే వాళ్లెవ‌రు?
జ‌ర్న‌లిజం విలువ‌ల గురించి య‌జ‌మానులు మాట్లాడ్డ‌మే విచిత్రం. అంతెందుకు కరోనా మ‌హ‌మ్మారిని సాకుగా చూపి వంద‌ల సంఖ్య‌లో త‌మ‌త‌మ ప‌త్రిక‌ల నుంచి తొల‌గిస్తూ...ఉద్యోగుల పాలిట క‌రోనా వైర‌స్‌లైన ప‌త్రికాధిప‌తుల‌తో క‌రోనా క‌ట్ట‌డిపై ప్ర‌ధాని మాట్లాడ‌టం విచిత్రం.
కావున జ‌ర్న‌లిస్టు మిత్రులారా...మ‌న మీడియా సంస్థ‌ల్లో ఎడిట‌ర్ల‌కే దిక్కులేదు. అలాంట‌ప్పుడు ఎక్క‌డో మారుమూల మండ‌లి స్థాయి మొద‌లుకుని ప‌ట్ట‌ణాల్లో ప‌నిచేసే విలేక‌రుల‌కు, స్టాప్‌రిపోర్ట‌ర్ల‌కు, బ్యూరో ఇన్‌చార్జ్‌ల‌కు ఈ యాజ‌మాన్యాలు కిరీటాలు పెడుతాయ‌నే భ్ర‌మ నుంచి ఎంత త్వ‌ర‌గా బ‌య‌టికొస్తే అంత మంచిది. క‌రోనా పుణ్య‌మా అని జ‌ర్న‌లిస్టుల క‌ళ్ల‌లో మ‌బ్బులు ఇప్పుడిప్పుడే తొల‌గిపోతున్నాయి.
బ‌తికి ఉంటే ఏ యూట్యూబ్ చాన‌లో, వెబ్‌సైట్‌కో రాస్తూ...ఇంత‌కంటే సుఖ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. కావున ప్ర‌స్తుత ఈ ప‌త్రిక‌లు, చాన‌ళ్ల‌లో భ‌విష్య‌త్‌ను చూసుకోవ‌డం అంటే ఎండ‌మావ‌ళ్ల‌లో నీటి త‌డిని వెతుక్కోవ‌డ‌మే అవుతుంది.
ఇప్ప‌టికైనా జ‌ర్న‌లిస్టు మిత్రులు త‌మ ఆర్థిక స్థితిగ‌తుల‌ను స‌రిదిద్దుకోవాలి. క‌రోనా అనేది విప్ల‌వాత్మ‌క ప్ర‌క్షాళ‌న కోసం వ‌చ్చింద‌నే పాజిటివ్ దృష్టి కోణంలో ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. వ్య‌వ‌స్థ‌లో చోటు చేసుకోబోతున్న పెనుమార్పుల‌ను మ‌న జీవిక‌కు అనుగుణంగా ఎలా మ‌లుచుకోవాలో సీరియ‌స్‌గా ఆలోచించాలి. అందుకు అనుగుణంగా జ‌ర్న‌లిస్టులు స‌రైన‌ అడుగులు వేయాల‌ని హెచ్చ‌రించేందుకు ఓ జ‌ర్న‌లిస్టుగా రాసిందే ఈ ఆర్టిక‌ల్‌.


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*