26-4-2020 అక్షయ తృతీయ సందర్బముగా సింహాచలంలో చందనోత్సవం గురించి. 

26-4-2020 అక్షయ తృతీయ సందర్బముగా సింహాచలంలో చందనోత్సవం గురించి.


     సింహాచలం, ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు) :        విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామికి చాలాచోట్ల ఆలయాలు ఉన్నాయి. కానీ ఎక్కడా లేని విధంగా సింహాచలంలోని వరాహనరసింహస్వామికి చందనపు పూత కనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు! సింహాచల క్షేత్రంలో ఒకటి కాదు, రెండు విష్ణుమూర్తి అవతారాలు కొలువై ఉన్నాయి. అటు హిరణ్యాక్షుని సంహరించిన వరాహావతారం, ఇటు హిరణ్యకశిపుని అంతమొందించిన నరసింహావతారం కలిసి ఇక్కడ వరాహనరసింహ అవతారంగా వెలిశారు. వరాహ మొఖం, మానవుని శరీరం, సింహపు తోకతో ఇక్కడి మూలవిరాట్టు కనిపిస్తుంది. అసలు నరసింహ అవతారం అంటేనే ఉగ్రమూర్తి, దానికి తోడు మరో ఉగ్రరూపమైన వరాహమూర్తి కూడా కలిస్తే ఇంక చెప్పేదేముంది. అందుకే స్వామివారి మీద నిత్యమూ చందనపు పూతని పూస్తారు. ఒక్క అక్షయ తృతీయ సందర్భంగా మాత్రమే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భాగ్యాన్ని కలిగిస్తారు.
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి?
 పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు, విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి, నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది.
చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి.... తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ, ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.
 
ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహులు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్యరూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు. అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఏటా అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం ఘనంగా జరిగే విషయం తెలిసిందే! ఇందుకోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్నే ఇందుకు వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలుపెడతారు.
 
తెల్లవారితే అక్షయ తృతీయ అనగా, అర్థరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూపం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే
అక్షయతృతీయ రాత్రివేళ వరకూ భక్తుల దర్శనం సాగిన తరువాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో ‘సహస్ర ఘటాభిషేకాన్ని’ నిర్వహిస్తారు. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. అటు మీదట మూడు మాణుగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు.
ఈ చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి నాలుగు సార్లు మూడు మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటుగా వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మాణుగలు.... అంటే 500 కిలోల చందనాన్నీ, అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.