వలస వాసులు కాలినడక ప్రయాణాలు చేయవద్దు :వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

వలస వాసులు కాలినడక ప్రయాణాలు చేయవద్దు :వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వలస వాసులు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వారి వారి ప్రాంతాలకు చేరుకునేందుకు ఎట్టి పరిస్థితులలోనూ కాలినడకన ప్రయాణాలు చేయవద్దని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సూదూర ప్రాంతాల నుండి పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకు వచ్చిన వారి సమాచారమును సేకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. గురువారం సాయంత్రం వింజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంకు కాలినడకన బయలుదేరిన 6 మందిని పోలీసులు గుర్తించి వారిని తహసిల్ధారు కార్యాలయం వద్దకు తరలించారు. వీళ్ళు గత 3 నెలల క్రితం చంద్రపడియ గ్రామంలో రామాలయం నిర్మాణానికి కూలీలుగా రావడం జరిగింది. ఉగాది నాటికి పనులు పూర్తయినా అప్పటికే కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న మొన్నటి వరకు చంద్రపడియ గ్రామంలోనే ఉంటున్న కూలీలు చివరికి గత్యంతరం లేని పరిస్థితులలో కాలినడకన పెద్దాపురంకు బయలుదేరారు. బుక్కాపురం రోడ్డు మార్గాన వెళుతున్న కూలీలను గుర్తించిన స్థానికులు ఎస్.ఐ బాజిరెడ్డికి సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన ఆయన కాలినడకన వెళుతున్న కూలీలకు నచ్చజెప్పి వింజమూరు మండల కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ ఎండలలో కాలినడక అత్యంత ప్రమాదకరమని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.