బియ్యం కార్డులకే ఆర్థిక సాయం

బియ్యం కార్డులకే ఆర్థిక సాయం
రేషన్‌ కార్డులు బియ్యానికే పరిమితం
18 లక్షల కుటుంబాలకు సాయం దూరం
బియ్యం కార్డులకే ఆర్థిక సాయం
 అమరావతి: బియ్యం కార్డు జాబితా ఆధారంగానే ప్రస్తుతం ఆర్థిక సాయం అందించేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ)శాఖ సిద్ధమవుతోంది. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ఏళ్ల కిందట 1.47 కోట్ల రేషన్‌కార్డులనిచ్చారు. ఈ రేషన్‌కార్డులను పక్కన పెట్టేసి వైఎస్సార్‌ నవశకం కింద 1.29 కోట్ల కుటుంబాలకు ఇటీవల బియ్యం కార్డులను ఇచ్చారు. ఇప్పుడు వాటినే ఆర్థిక సాయానికి రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలోని 18 లక్షల కుటుంబాలకు ఇంటికి రూ.వెయ్యి చొప్పున అందని పరిస్థితి ఏర్పడింది. రేషన్‌ కార్డుల జాబితా ప్రకారం రూ.1,470 కోట్లు అవసరం కాగా ఇప్పుడు రూ.1,300 కోట్లనే ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా రేషన్‌కార్డుల వ్యవస్థ నడుస్తోంది. అయితే ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కొత్తగా బియ్యం కార్డులనివ్వాలని గతేడాది నిర్ణయించింది. వైఎస్సార్‌ నవశకం కింద 3నెలల కిందట వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించి 1.29 కోట్ల కుటుంబాలకు బియ్యం కార్డులనిచ్చింది. ఏప్రిల్‌ నుంచి ఈ జాబితా ప్రకారమే రేషన్‌ ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
పౌరసరఫరాలశాఖకు రేషన్‌కార్డులే లెక్క
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఏప్రిల్‌లో రెండు దఫాలుగా రేషన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఏప్రిల్‌ 15 నుంచి ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఇస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా బియ్యం కార్డుల జాబితాను పక్కన పెట్టి పాత రేషన్‌కార్డుల జాబితా ఆధారంగానే 1.47 కోట్ల కుటుంబాలకు పంపిణీ చేస్తోంది. అయితే పౌరసరఫరాలశాఖ పరిధిలోని బియ్యం కార్డుదారుల జాబితా ఆధారంగా కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించాలని రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ  ఉత్తర్వులిచ్చింది.