ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

25.04.2020
అమరావతి


కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం


రాష్ట్ర వ్యాప్తంగా కొసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌   


రాష్ట్రంలో 1016 పాజిటివ్‌ కేసులు:


రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 6928 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 61 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 1016 కు చేరింది. 
కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 275 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 209, కృష్ణా జిల్లాలో 127, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 72, వైయస్సార్‌ కడప జిల్లాలో 55,  ప్రకాశం జిల్లాలో 53, అనంతపురం జిల్లాలో 51, పశ్చిమ గోదావరి జిల్లాలో 39, తూర్పు గోదావరి జిల్లాలో 37, విశాఖపట్నం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.
 కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 171 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కృష్ణా జిల్లాలో 29 మంది, వైయస్సార్‌ కడప జిల్లాలలో 28 మంది, గుంటూరు జిల్లాలో 23 మంది, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, అనంతపురం జిల్లాలలో 13 మంది, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలలో 12 మంది చొప్పున, చిత్తూరు జిల్లాలో 11 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, నెల్లూరు జిల్లాలో 8 మంది, కర్నూలు జిల్లాలో 7గురు.. మొత్తం 145 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
 ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు.
 మరోవైపు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.  


కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:


టెలి మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశం.
కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీని వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్న సీఎం.
టెలి మెడిసిన్‌ నెం: 14410 కు మరింత ప్రచారం కల్పించాలన్న సీఎం.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలన్న సీఎం.
కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవడం చాలా అవసరమన్న సీఎం.
గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం.
ల్యాబులు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగు చూసినందున ఒక మంచి అధికారిని అక్కడ నియమించాలని సీఎం ఆదేశం.
ఇది వరకే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలన్న సీఎం.


జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:


శ్రీకాకుళం జిల్లా:


జిల్లాలో కొత్తగా కోవిడ్‌–19 కేసులు నమోదు కావడంతో పాతపట్నం మండలంలో 18 గ్రామాల్లో లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేసారు. పాతపట్నం మండలానికి చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ నుండి వచ్చారని, ఆ వ్యక్తికి గురువారం స్ధానికంగా పరీక్షలు చేయగా పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చిందని, ఆ తర్వాత తుది ఫలితాల కోసం కాకినాడకు పంపించగా నెగిటివ్‌ వచ్చిందని కలెక్టర్‌ తెలిపారు. అయితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని, ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న 29 మందిని ప్రాథమికంగా పరీక్షించగా ముగ్గురుకి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఇంకా మరో వ్యక్తికి స్ధానికంగా పాజిటివ్‌ వచ్చిందని తుది ఫలితాల్లో నిర్ధారణ కావల్సి ఉందని కలెక్టర్‌ వెల్లడించారు.
 కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు మర్కజ్‌తో సంబంధం లేదని కలెక్టర్‌ చెప్పారు. జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 211 మందిని గుర్తించి హోం ఐసొలేషన్‌లో ఉంచి పర్యవేక్షించామని వెల్లడించారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి 13,500 మంది వచ్చారని, వారందరినీ  ట్రాక్‌ చేసి హోమ్‌ ఐసోలేషన్‌ లో పెట్టామని తెలిపారు. వారు ఇక మీదట కూడా ఇళ్ళల్లోనే ఉండాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే స్ధానిక ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలకు తెలియజేయాలని సూచించారు.
 జిల్లాలో ఇంకా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం లేదన్న కలెక్టర్, ముందు జాగ్రత్తగా మండల స్దాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, తదితర శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజలు కూడా సహకరించాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణలో ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ విజ్ఞప్తి చేశారు. 
18 గ్రామాల్లో కంటైన్మెంటు:
పాతపట్నంతోపాటు కాగువాడ, సీది, కొరసవాడ చుట్టు ప్రక్కల 18 గ్రామాలకు పూర్తిగా లాక్‌ డౌన్‌ చేశామని, పూర్తిగా కంటైన్మెంటు జోన్‌గా కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేసారు. ఈ గ్రామాలకు అన్ని కాయగూరలు, కిరాణా, మందులు, సరుకులు, తాగు నీరు డోర్‌ డెలివరీ చేస్తామని, పశువులకు కూడా అక్కడే ఆహారం అందించాలని, ఏ ఒక్కరూ బయటకు రావడానికి వీల్లేదని చెప్పారు. అందువల్ల ఏ ఒక్కరూ బయటకు రావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఎవరి ఇళ్లలో వారే ఉండాలని, కనీసం పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లోకి వెళ్లకూడదని ఆదేశించారు. 
ప్రత్యేక బృందాలు:
పాతపట్నంతోపాటు ఇతర గ్రామాల్లో ఇంటింటి సర్వే కోసం ప్రత్యేక వైద్య బృందాలను.. 23 మంది వైద్యులు, 200 మంది ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేశామని, ఆ బృందాలు క్షేత్ర స్ధాయిలో పూర్తిగా గాలిస్తాయని, ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే, వెంటనే వారిని క్వారంటైన్‌లో పెడతామని కలెక్టర్‌ నివాస్‌ వివరించారు.


విజయనగరం జిల్లా:


జిల్లాలో కరోనా నియంత్రణకు ఏడు అంచెల విధానాన్ని పాటిస్తూ ప్రతి అంశంపై మైక్రో లెవెల్‌లో ప్రణాళికలు వేసుకుంటూ పర్యవేక్షించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ డా. హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు.   శనివారం జిల్లా కమాండ్‌ కంట్రోల్‌  కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడ సిబ్బంది పొందుపరుస్తున్న నివేదికలను పరిశీలించి తగు సూచనలు చేశారు. 
 ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్‌.. సర్వైలెన్స్, క్వారంటైన్, ఆస్పత్రుల సన్నద్ధం, శానిటేషన్, షెల్టర్‌ హోమ్స్, నిత్యావసరాల సరఫరా, కంటైన్మెంట్‌.. అనే ఏడు అంశాలపై ప్రత్యెక దృష్టి పెట్టి పని చేస్తున్నామని తెలిపారు. దేనికదే ముఖ్యమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్యం, అవగాహనా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని ఆదేశించారు.   
పారిశుద్ధ్య కార్యక్రమాలు:
 పారిశుద్ధ్యానికి సంబంధించి జిల్లాలోని ఐదు మున్సిపల్‌ ప్రాంతాల్లో నున్న 191 మురికివాడల్లో 344 బృందాల ద్వారా ఇప్పటికే సోడియం హైపో క్లోరైడ్‌ స్ప్రే చేయడమైనదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో, ప్రధాన రహదారుల్లో, మురికి వాడల్లో అన్ని వార్డుల్లో, కూడళ్ళలో, మార్కెట్లలో, రైతుబజార్లలో ఇన్ఫెక్షన్‌ రాకుండా క్లోరోక్విన్‌ ద్రావణాన్ని   అగ్నిమాపక యంత్రాల ద్వారా, ట్యాంకర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా చల్లడం జరిగిందని అన్నారు. 
 ఇందు కోసం 7136 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్, 1,15,380 కేజీల బ్లీచింగ్‌ను, 75 వేల కేజీల సున్నంను, 131 లీటర్ల క్రిజోల్‌ వినియోగించడం జరిగిందన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 5861 మంది పారిశుధ్ధ్య సిబ్బందికి 20 వేల మాస్క్‌ లతో పాటు, 300 లీటర్ల శానిటైజర్‌ పంపిణీ చేశామని కలెక్టర్‌ వెల్లడించారు. 
ఐఈసీ కార్యక్రమాలు:
 పారిశుద్ధ్య పనులు చేపడుతూనే కరోనాపై అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ఐఈసి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అన్ని వీధుల్లో 40 వాహనాల్లో మైకుల ద్వారా ప్రచారం చేయడంతో పాటు, 2.76 లక్షల కరపత్రాలు ముద్రించి పంచడం జరిగిందన్నారు. కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రతలతో 5 మున్సిపాలిటీల్లో 256 హార్డింగ్‌ లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు.


విశాఖపట్నం జిల్లా:


కోవిడ్‌–19 కారణంగా లాక్‌ డౌన్‌లో ఉన్న వలస కార్మికులకు మరియు నిరుపేదల సహాయార్థం ఎల్‌ అండ్‌ టి హైడ్రోకార్బన్‌ ఇంజనీరింగ్‌ విభాగం సిబ్బంది శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను కలిసి వలస కార్మికులకు పంపిణీ నిమిత్తం తయారుచేసిన ఆహారపు కిట్లను అందజేశారు. ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ గోధుమ పిండి, 1 లీ ఆయిల్‌తో కిట్‌లు తయారు చేసి, మొత్తం 1200 కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఎల్‌–టీ హైడ్రోకార్బన్‌ ఇంజనీరింగ్‌ సిబ్బంది తెలిపారు. 


కృష్ణా జిల్లా:


జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ అనుమానిత శాంపిల్స్‌ 6151 పరీక్షలకు పంపగా, వాటిలో 127 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. 4995 కేసులు నెగటివ్‌గా రాగా, ఇంకా 1031 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రులలో చికిత్స పొందిన వారిలో 29 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 జిల్లాలో 34 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 739 మందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. వలస కార్మికుల కోసం 56 వసతి కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 4603 మంది బస చేశారు. వారికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. జిల్లాకు విదేశాల నుంచి 2443 మంది రాగా, వారందరినీ ట్రాక్‌ చేసి స్వీయ గృహ నిర్భంధంలో ఉంచారు. 28 రోజుల గడువు పూర్తి కావడంతో వారందరిని వదిలేశారు. కాగా కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నాయన్న అనుమానంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 మంది ఆస్పత్రుల్లో చేరారు.


చిత్తూరు జిల్లా:


శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్‌ డౌన్‌ రెడ్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లినందున ప్రజలు బయటకు రావడానికి అనుమతి లేదని, ఈ విషయంలో ప్రజలందరూ ఇంటి పట్టునే ఉండి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ డా. నారాయణభరత్‌ గుప్త విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలో లాక్‌ డౌన్‌ అమలును జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పరిశీలనలో భాగంగా తొలుత శ్రీకాళహస్తి మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ను ఆయన సందర్శించారు.  నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలను వాలంటీర్ల ద్వారా హోం డెలివరీ చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్‌ మరియు ప్రత్యేక అధికారి పృథ్వీతేజ్‌ కలెక్టర్‌ కు వివరించారు.
 ఆ తర్వాత పట్టణంలోని బేరివారి వీధిలో గల మెడికల్‌ షాప్‌ వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్‌ వాలంటీర్ల ద్వారా మెడిసిన్స్‌ హోం డెలివరికి సంబందించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్‌ షాప్‌ ల నందు చిన్న పిల్లలకు అవసరమైన మందులు, ఇతరత్రా సంబందిత వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మెడిసిన్స్‌ కొరకు ఎక్కువ దూరం రావలసి వస్తున్నదని, ఎక్కడిక్కడ అందుబాటులో ఉన్న మెడికల్‌ షాప్‌ లను తెరిచి ఉంచిన యెడల సులువుగా ఉంటుందని వాలంటీర్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా ఈ విషయం పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పూర్తి స్థాయిలో మెడికల్‌ షాప్‌ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.
 జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నట్లైతే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారని, వీరితో పాటు పిఇఎస్, కుప్పం మెడికల్‌ కళాశాలకు చెందిన జూనియర్‌ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడం జరుగుతున్నదని, కాబట్టి వదంతులను నమ్మకుండా ప్రజలు సహకరించి కరోనా కట్టడిలో కలసి రావాలని కలెక్టర్‌ కోరారు.


అనంతపురం జిల్లా:


విధి నిర్వహణలో కరోనా సోకి చనిపోయిన పరిగి ఏఎస్సై హబీబుల్లా కుటుంబానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని వారం తిరగకుండానే బాధిత కుటుంబానికి చెక్కు రూపంలో అందజేశారు. స్వయంగా జిల్లాకు వచ్చిన డీజీపీ దామోదర గౌతం సవాంగ్‌ రూ.50 లక్షల చెక్కును హబీబుల్లా కుటుంబానికి అందజేశారు. దీనిపై జిల్లా పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు  కుటుంబాలకు అండగా ఉంటామని బాధిత కుటుంబాల్లో ఆత్మస్థైర్యం, భరోసా ఇచ్చిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, డీజీపీ గౌతం సవాంగ్‌కు జిల్లా పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భరోసాతో మున్ముందు విధుల్లో మరింత అంకిత భావం, రెట్టింపు ఉత్సాహంతో కరోనా కట్టడికి కృషి చేస్తామని జిల్లా పోలీసులు పేర్కొన్నారు.


వైయస్సార్‌ కడప జిల్లా:


కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బి.అంజాద్బాష పేర్కొన్నారు. శనివారం ఆయన మాసాపేట బిస్మిల్లానగర్‌లో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తుందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నిర్వహించడం జరిగిందన్నారు. లాక్‌ డౌన్‌ వల్ల పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల దాతల సహకారంతో పేదలకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 
 కరోనా నివారణకు ప్రతి ఒక్కరు భౌతిక దూరంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తమ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రపరుచుకుని దోమలు ఈగలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వానికి  ఆదాయం లేక పోయినా ప్రస్తుత విపత్కర పరిస్థితులలో డ్వాక్రా మహిళల ఆదుకోవాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద 1400 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి వివరించారు.


కర్నూలు జిల్లా:


వారు కరోనాను జయించారు. ఒకరూ ఇద్దరు కాదు. ఏకంగా 24 మంది  విశ్వ భారతి జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని శనివారం సాయంత్రం డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో ఇంత మంది కరోనా మహమ్మారి నుంచి బయట పడటం తొలిసారి కావడం విశేషం. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 24 మంది ఈ నెల 6న జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి విశ్వభారతి ఐసోలేషన్‌ వార్డులలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరంతా కర్నూలు జిల్లాలోని విశ్వ భారతి జిల్లా కోవిడ్‌–19 ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య సేవలతో పాటు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందజేశారు.  వీరికి రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్‌ రిపోర్టు రావడంతో వీరిని శనివారం ఆస్పత్రి నుంచి స్టేట్‌ కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ అజయ్‌ జైన్, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ దగ్గరుండి డిశ్చార్జ్‌ చేయించారు.
 ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేల ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారికి పౌష్టికాహారం కలిగిన కిట్‌ కూడా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ మాట్లాడుతూ మరో 14 రోజుల పాటు ఇంటిలో ఐసోలేషన్‌ నిబంధనలు పాటించాలన్నారు.
కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 24 మంది డిశ్చార్చ్‌ కావడం జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం కలిగించిందన్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా 31 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్‌ చేశామన్నారు.
 కాగా ఆసుపత్రి నుంచి బయటికి వస్తున్నప్పుడు 24 మంది ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఆసుపత్రిలో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
 ‘కరోనా వైరస్‌ వచ్చిందని చాలా ఆందోళన చెందాము. కానీ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు మాకు జీవితంపై భరోసా కల్పిస్తూ చేయూతను అందించారు. ఎప్పటికప్పుడు మా గురించి తెలుసుకుని సౌకర్యాలను, పౌష్టికాహారం అందించారు. కరోనా బారిన పడినా మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం ప్రభుత్వం తరçపున భరించారు. మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా సురక్షితంగా ఇంటికి పంపించడంతో పాటు మాకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి, ప్రభుత్వానికి, డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు అందరికీ ధన్యవాదాలు’ అని వారు పేర్కొన్నారు.