కుదేలు అవుతున్న ప్రింట్ మీడియా* ...

*కుదేలు అవుతున్న ప్రింట్ మీడియా 


ప్రింట్‌ మీడియా సంక్షోభానికి కారణాలు..


 ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రింట్‌ మీడియా కుదేలవుతోంది.
 దేశవ్యాప్తంగా ఉన్న ప్రింట్‌ మీడియా సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మిగతా అన్ని రకాల మీడియా.. టీవీలు, ఆన్‌లైన్‌ మీడియా కూడా సంక్షోభం దిశగా వెళుతున్నాయి. అయితే మీడియాలో తొలి దెబ్బ ప్రింట్‌ మీదే. దానికి కారణాలు..
1. న్యూస్‌ప్రింట్‌ (పత్రిక ప్రింట్‌ చేసే కాగితం) గత కొంతకాలంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కువ పత్రికలు న్యూస్‌ప్రింట్‌ను దిగుమతి చేసుకుంటాయి. తెలుగులోని ప్రధాన పత్రికలన్నీ రష్యా నుంచి న్యూస్‌ప్రింట్‌ కొంటున్నాయి. దీని కోసం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌ రేటు కూడా పెరుగుతూ పోతోంది. డాలర్‌ ధర రూ. 1 పెరిగితే.. ప్రింట్‌ మీడియా సంస్థ గుండె బెత్తెడు దిగజారుతుంది. ఇప్పుడు సంక్షోభం దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా ఆవరించింది. ఈ నేపథ్యంలో న్యూస్‌ప్రింట్‌ ధర పెరగడం ఖాయం. డాలర్‌ రేటు మరింత పెరిగితే.. అది అదనపు భారం.
2. ఇంకుల ధరలూ గత నాలుగేళ్లలో 3–4 రెట్లు పెరిగాయి. దేశంలో చాలా పత్రికలు బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉండగా, తెలుగులో అన్నీ రంగుల్లోనే వస్తున్నాయి. ఇంకుల ధరల పెరుగుదల కూడా పత్రికలకు భారంగా పరిణమిస్తోంది. ఇంకులు దేశీయంగానే లభిస్తున్నా, రంగుల తయారీ ముడిసరుకు దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో రంగుల ధరలు పెరగడం ఖాయం. పెరుగుదల భారాన్ని పత్రికలు భరించాల్సి ఉంటుంది.
3. ప్రింటింగ్‌ మిషనరీ విడిభాగాలు కూడా అన్నీ దాదాపు దిగుమతి చేసుకొనేవే. వాటి ధరలు స్థిరంగా ఉంటాయనే ఆశ లేదు. ఆ భారం కూడా క్రమంగా పెరుగుతుంది.
4. తెలుగులో ప్రధాన పత్రికల వ్యయంతో పోలిస్తే రాబడి ఎక్కువగా ఉంటోంది. ఎంత ఎక్కువ అనేది పత్రికనుబట్టి మారుతుంది. పూర్తిగా నష్టాల్లో నడుస్తున్న ప్రధాన తెలుగు పత్రికల్లేవు. అయితే రాబడి–వ్యయాన్ని ఈ నెలకు లెక్కబెట్టకూడదు. గత కొన్నేళ్లుగా సంపాదించిన లాభాలనూ పరిగణనలోకి తీసుకుంటే కరోనా వల్ల ఈనెల రోజుల్లో వచ్చిన నష్టాలు నామమాత్రమే. 
5. కరోనా ఎఫెక్ట్‌కు దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయింది. అన్ని రంగాలూ మూతబడ్డాయి. అందువల్ల ప్రకనటలు లేవు. పత్రికలకు ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలే. కరోనా ప్రభావం ముగిసిన తర్వాత కూడా ఆర్థిక రంగం ఒక్కసారిగా పుంజుకోదు. మాద్యం కొన్నేళ్లు కొనసాగుతుంది. అందువల్ల పత్రికలకు వచ్చే ప్రకటనలు తగ్గిపోతాయి. అంటే రాబడి తగ్గిపోతుంది. 
6. ఖర్చులు పెరగడం, రాబడి తగ్గడం.. పత్రికల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. రాబడి–వ్యయం మధ్య పొంతన లేకుండా పోవడంతో నష్టాలు మొదలవుతాయి. తర్వాత పత్రికలు మూత దిశగా అడుగులు వేయడం తప్ప మరోమార్గం ఉండదు. 
అవకాశాలను తెచ్చిపెడుతున్న సంక్షోభం
 ప్రతి సంక్షోభం తప్పనిసరిగా సరికొత్త అవకాశాలను మోసుకొస్తుంది. కొత్త మార్గాలను చూపిస్తుంది. ఇప్పుడు ప్రింట్‌ మీడియా ముందు కూడా కొత్త అవకాశాలు, సరికొత్త దారులు ఉన్నాయి. పత్రికలను కేవలం వ్యాపారంగా యాజమాన్యాలు చూస్తే సంక్షోభం నుంచి సులభంగా బయటపడవచ్చు. పత్రికలు ఫక్తు వ్యాపార సంస్థలని చాలా మంది భావన. అది నిజం కాదు. తెలుగు పత్రికా ప్రపంచం అందుకు భిన్నం. తెలుగులో దాదాపు అన్ని పత్రికలు రాజకీయ పార్టీలకు సాధనాలు. అవి పార్టీల ముసుగులు తొలగించి నిజమైన పత్రికలుగా, వ్యాపార వస్తువులుగా ముందుకు వస్తే... సంక్షోభం నుంచి గట్టెక్కడం చాలా సులభం. 
ఎలా గట్టెక్కవచ్చంటే..
1. తెలుగులో ప్రధాన పత్రికలన్నీ చాలా తక్కువ ధరకు పత్రికలను విక్రయిస్తున్నాయి. ఏ ప్రధాన పత్రికను తీసుకున్నా.. ఒక్కో కాపీ తయారీ ధర రూ. 25 తక్కువ కాకుండా ఉంటుంది. కానీ అందులో నాలుగోవంతుకే పత్రికలను విక్రయిస్తున్నారు. మిగతా వ్యయాన్ని ప్రకటన ద్వారా వచ్చే ఆదాయంతో పూడుస్తున్నారు. ఈ పద్దతి మారాలి. పత్రిక తయారీ ధరకు విక్రయించడం ప్రారంభించాలి. ఇలా చేస్తే.. పత్రిక అవసరం ఉన్నవారు కొంటారు. మిగతావారు కొనరు. 
2. వాస్తవ ధరకు పత్రికలను విక్రయించడం ప్రారంభిస్తే.. సర్క్యులేషన్‌ తగ్గిపోతుంది. ఎంతగా తగ్గుతుందంటే.. ఇప్పుడున్న సర్క్యులేషన్‌లో 30–40 శాతమే మిగులుతుంది. అది పత్రికలకు మంచిదే. ప్రజలకూ మంచిదే
3. ఇప్పుడు తెలుగులో(దేశమంతా కూడా) పత్రికలన్నీ తలకుమించిన సర్క్యులేషన్‌ భారాన్ని మోస్తున్నాయి. వాస్తవ ధరకు పత్రికలు విక్రయించడం ప్రారంభమయితే.. ఆ భారాన్ని దించుకున్నట్లే. వాస్తవ ధరకు విక్రయిస్తే.. పత్రిక కోసం చేసే వ్యయం ప్రజల నుంచి నేరుగా వస్తుంది. ప్రకటనల మీద వచ్చేది అదనపు ఆదాయం అవుతుంది. ఫలితంగా పత్రికలు లాభాల్లో నడుస్తాయి.
4. న్యూస్‌ప్రింట్, ఇంకుల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల పత్రికల మీద భారం తగ్గిపోతుంది. 
5. ఆన్‌లైన్‌ ఎడిషన్లను తెలుగు పత్రికలన్నీ ఉచితంగా అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఎడిషన్‌కు ధర నిర్ణయించాలి. హిందూ పత్రిక ఆన్‌లైన్‌ ఎడిషన్‌ చాలా కాలంగా ఉచితంగా లభించడం లేదు. కావాలనుకున్న వారు డబ్బు చెల్లించి చదువుకోల్సిందే. ఇది విధానాన్ని అన్ని పత్రికలు అనుసరించవచ్చు. ధర ప్రింట్‌ కాపీ అంత కాకుండా, అందులో పదో వంతు నిర్ణయించవచ్చు. 
6. ప్రకటనల ధరలు తెలుగులో చాలా తక్కువ. ప్రకటనల సంఖ్యను పెంచుకోవడానికి పోటీ పడి ధరలు తగ్గించాయి. సర్క్యులేషన్‌ ఫిగర్స్‌ను చూపించి ప్రకటనలు తెచ్చుకుంటున్నాయి. దాని కోసం పోటీపడ సర్క్యులేషన్‌ను పెంచుకోవడం వల్ల పత్రికల నెత్తిన బరువు ఎక్కువై కూర్చుకుంది. ఆ పోటీ నుంచి బయటపడితే(పత్రికలు బతకాలంటే బయటపడటం మినహా మరోమార్గం లేదు) అవసరం ఉన్న కంపెనీలు ప్రకనటలు ఇవ్వడానికి పత్రికాఫీసులకు వస్తాయి. 
7. పత్రిక ధర భారీగా పెంచితే పత్రికలను ఎవరూ కొనరనే భావన పత్రికల్లో పనిచేస్తున్న వారికి ఉంటుంది. పత్రిక తయారీ ధరకు ఎవరూ కొనడం లేదంటే దాని అవసరం ఎవరికీ లేదని అర్థం. అవసరం లేని దాన్ని కొనిపించడం ఎవరికీ సాధ్యం కాదు(మార్కెట్‌ మాయాజలం అందుకు భిన్నం). అవసరం లేని దాన్ని ప్రజలు కొనాలని జర్నలిస్టులు కూడా భావించకూడదు. ప్రజలకు అవసరమైన సమాచారం ఉచితంగా దొరకదని, దాన్ని కొని చదవాల్సిందేనని ప్రజలు భావించే విధంగా పత్రికలు మారాలి. ఈ దిశగా అడుగులు వేయడం పెద్ద కష్టమేమీ కాదు. 
8. పత్రికలు సంక్షోభాల్లో కూరుకుపోవడం కంటే.. సంక్షోభాల్లో నుంచి కొత్త అవకాశాలను పట్టుకొని గట్టెక్కడాకి ప్రయత్నించడమే మేలు. అలా కాకుండా సిబ్బందిని తగ్గించాలనే దిశగా చాలా పత్రికలు అడుగులు వేస్తున్నాయి. అది ఆత్మహత్యాసదృస్యమే అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్టాప్‌ జీతాల వ్యయం.. పత్రిక మొత్తం వ్యయంలో 40 శాతానికి మించి ఉంటోంది. తెలుగులో చాలా పత్రికల్లో జీతాల వ్యయం 10 శాతానికి చాలా దిగువన ఉంది. సిబ్బందిని తగ్గిస్తే.. వ్యయం పెద్దగా తగ్గదు. కానీ నాణ్యత పడిపోతుంది. ఫలితంగా సంక్షోభం మరింత తీవ్రమవుతుందే తప్ప.. సమస్యకు పరిష్కారం లభించదు.