జర్నలిస్ట్ కుటుంబం దాతృత్వం అందరికీ ఆదర్శం

జర్నలిస్ట్ దాతృత్వం అందరికీ ఆదర్శం


వింజమూరు, ఏప్రిల్ 4, (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): లాక్ డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వింజమూరు ప్రజాశక్తి విలేకరి మూలి.హజరత్ రెడ్డి దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తహసిల్ధారు సుధాకర్ రావు, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీలు కొనియాడారు. స్థానిక బంగ్లాసెంటర్ వద్ద మూలి.హజరత్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు మాలకొండారెడ్డి, ఆదిశేషమ్మలు పంచాయితీ పరిధిలో పనిచేస్తున్న 31 మంది పారిశుద్ధ్య కార్మికులకు వంట సరుకులు అందజేశారు. బియ్యం, ఉప్పు, పప్పులు, ధనియాలు, పసుపు, కారం, చింతపండు తదితర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజల జీవన విధానాలకు ఆటంకంగా మారిందన్నారు. ప్రమాదకరమైన ఈ వైరస్ ను నియంత్రించాలంటే ప్రజలు స్వీయ నిర్భంధంలో ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ తరుణంలో ప్రజల ఆరోగ్యం కోసం మండుటెండలను లెక్కచేయకుండా నిరంతరం పారిశుద్ధ్య పనులలో మునిగితేలుతున్న పారిశుద్ధ్య కార్మికులకు  వంట సరుకులు పంపిణీ చేయడం ముదావహమన్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలకు ధీటుగా నేను సైతం అంటూ ప్రజాశక్తి రిపోర్టర్ హజరత్ రెడ్డి సేవలు అందించడం యావత్ జర్నలిస్టులకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి, అంతిమతీర్పు దినపత్రిక ప్రతినిధి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రెవిన్యూ, పంచాయితీ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.