కుప్పం అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్... పలు కీలక సూచనలు

కుప్పం అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్... పలు కీలక సూచనలు...


కుప్పం అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య, రెవిన్యూ, పోలీస్, వ్యవసాయ, ఉద్యాన, మున్సిపల్ అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గున్నారు. కుప్పంలో పాజిటివ్ కేసులు లేకపోవడం సంతోషం అని అన్నారు. బాగా పనిచేస్తున్న అధికారులకు చంద్రబాబు అభినందనించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టుల వద్ద బందోబస్తు చర్యలు పెంచాలి అన్నారు. ఒకసారి వస్తే కరోనా వైరస్ అంతటితో ఆపలేం అని, కరోనాను మొదట్లోనే నియంత్రించాలని, చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "కుప్పంలో పాజిటివ్ కేసులు లేకపోవడం సంతోషం. బాగా చేస్తున్న అధికారులకు అభినందనలు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి. చెక్ పోస్ట్ ల వద్ద బందోబస్తు చర్యలు పెంచాలి. ఒకసారి వస్తే కరోనా వైరస్ అంతటితో ఆపలేము. అందుకే దీనిని మొదట్లోనే నియంత్రించాలి. కరోనా విధ్వంసం 3వ ప్రపంచ యుద్దాన్ని తలపిస్తోంది. రెండో ప్రపంచ యుద్దంలోనూ ఇంత ప్రాణనష్టం లేదు. కరోనా రోగుల సంఖ్య మరో 2రోజుల్లో 2మిలియన్లు కానుంది. ఇప్పటికే లక్షా 15వేల మంది మరణించారు. న్యూయార్క్ లో శవాలను పూడ్చటానికి కూడా చోటు ఉండటం లేదు."


"కరోనాతో సమాజం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది ఏ ఊరికో, జిల్లాకో, దేశానికో పరిమితం కాలేదు. దావానలంలా ప్రపంచం అంతా కరోనా విస్తరిస్తోంది. గత 3వారాల్లోనే దేశంలో 100 రెట్లు పెరిగింది. మన రాష్ట్రంలో 200రెట్లు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరిగితే మనచేతుల్లో ఏమీ ఉండదు. అందుకే అసలు కేసులే రాకుండా చూసుకోవాలి. కుప్పంలో కేసులు రాకుండా చూస్తున్న అధికారులు అందరికీ అభినందనలు. డాక్టర్లు, అంగన్ వాడి సిబ్బంది, ఆశావర్కర్లు, పారిశుద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. అధికారులు అందరూ సమష్టిగా పని చేయాలి. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంగా పని చేయాలి. ప్రజలంతా అధికారులకు పూర్తిగా సహకరించాలి. కుప్పంలో 100 పంచాయితీలు, 632గ్రామాల్లో పారిశుద్యం మెరుగుపర్చాలి. హైపో క్లోరైడ్ పిచికారీ చేయాలి. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు సిద్దంగా ఉంచాలి. "
"నెల్లూరు డాక్టర్ మృతి కరోనా తీవ్రతకు నిదర్శనం. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి మాస్క్ లు, పిపిఈలు అందజేయాలి. ఆసుపత్రులలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సద్వినియోగం చేసుకోవాలి. 186గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను వినియోగించుకోవాలి. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. మార్కెట్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. చౌకడిపోలు, మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించాలి. క్వారంటైన్ కేంద్రాలలో వసతులు పెంచాలి. కుప్పంలో ఇంకా 3వేల మందికి రూ 1000, రేషన్ సరుకులు అందలేదు. కూపన్లు ఇచ్చి ఏ రోజు ఎవరెవరు రేషన్ కు రావాలో ముందే చెప్పాలి. చౌకడిపోల వద్ద భౌతికదూరం పాటించాలి. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తే ఈ సమస్య ఉండదు. వేసవి 3నెలలు తాగునీటి కొరత లేకుండా చూడాలి. పండ్లతోటలు, పూలతోటల రైతులకు అండగా ఉండాలి. సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలి. నీటి కొరత, దిగుబడి తగ్గి, ధర తగ్గి సెరికల్చర్ రైతులు నష్టాల్లో మునిగారు. టమాటా, అరటి, మామిడి, పూలతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలని" చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.