అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం పాటించండి. :. వింజమూరు తహసిల్ధారు వినూత్న ప్రచారం

అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం పాటించండి. :. వింజమూరు తహసిల్ధారు వినూత్న ప్రచారం


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): అందరికీ నమస్కారమండీ...స్వీయ నిర్భంధం, సమదూరం పాటించండి అంటూ వింజమూరు తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు వింజమూరులో నిత్యం వినూత్న తరహాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజులకు పైబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి ప్రజలు స్వీయ నిర్భంధంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి సర్వత్రా తెలిసిందే. అయితే ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు, పాల కేంద్రాలు, మెడికల్ షాపులకు మినహాయింపులున్నాయి. వీటి వద్ద మాత్రం ప్రజలు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తహసిల్ధారు ప్రతిరోజూ ఉదయం కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ధరల పట్టికల దగ్గర నుండి సరుకులు కొనుగోళ్ళును పరిశీలిస్తూ మధ్య మధ్యలో వినియోగదారులకు సమదూరం పాటించండి, స్వీయ నిర్భంధంలో ఉండండి అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకొంటున్న వైనం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సాక్షాత్తూ తహసిల్ధారు మరియు మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉండి కూడా సాధారణ పౌరుని మాదిరిగా తెల్లవారుజామునే రోడ్లుపైకి చేరుకుని కరోనా నియంత్రణ డ్యూటీలో నిమగ్నం కావడం అభినందనీయమని పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత నెల రోజులకు ముందు చేజర్ల నుండి సాధారణ బదిలీలలో భాగంగా వింజమూరు తహసిల్ధారుగా సుధాకర్ రావు భాధ్యతలు చేపట్టారు. అనంతరం లాక్ డౌన్ లో భాగంగా ఆయన ఇంటికో, కార్యాలయానికో పరిమితం కాలేదు. ఉదయాన్నే 5 గంటలకు మార్నింగ్ వాక్ అంటూ ప్రధాన కూడళ్ళలోకి వచ్చేస్తున్నారు. కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద తిష్టవేసి ధరలు అదుపులో ఉన్నాయా లేదా కృత్రిమ కొరత ఉందా అనే విషయాలను వినియోగదారులను అడిగి తెలుసుకుంటున్నారు.