నియోజకవర్గంపై మంత్రి మేకపాటి నిఘా

 


తేదీ: 26-04-2020,
అమరావతి.


నియోజకవర్గంపై మంత్రి మేకపాటి నిఘా


* సొంత నియోజకవర్గంలో మంత్రి ఆకస్మిక పర్యటన


* ఆత్మకూరు మార్కెట్ లో నిత్యవసరాలు , ప్రజల మధ్య భౌతికదూరం పరిశీలన


* ప్రజల సమస్యలు, పారిశుద్ధ్య పనుల అమలు తీరుపై మంత్రి  ఆరా


* 'మర్రిపాడు' సరిహద్దుల్లో నిఘాను పర్యవేక్షించిన గౌతమ్ రెడ్డి


* ప్రజలంతా బాధ్యతగా లాక్ డౌన్ పాటిస్తుండడంపై మంత్రి సంతృప్తి


* ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తానున్నాంటూ భరోసానిచ్చిన గౌతమ్ రెడ్డి



అమరావతి, ఏప్రిల్, 26; పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన నియోజకవర్గం ఆత్మకూరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాలలో సుడిగాలి పర్యటన చేస్తూ లాక్ డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక తనిఖీతో ఒక్కసారిగా నియోజకవర్గ యంత్రాంగం అప్రమత్తమైంది. మర్రిపాడు మండల సమీపంలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి పర్యవేక్షించారు. తనిఖీలలో పోలీసులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఎవరైనా ఆకలిదప్పుల వంటి అత్యవసర ఇబ్బందుల్లో ఉంటే మానవత్వంతో స్పందించి సాయం చేయాలని కోరారు. రాత్రుళ్లు ఎవ్వరూ  సరిహద్దులు దాటకుండా మరింత నిఘా పెట్టాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. కరోనా నియంత్రణకే అందరం పోరాడుతున్నామన్న విషయాన్ని ప్రజలకు సహనంగా అవగాహన కలిగించాలని సూచించారు.


ఆత్మకూరు నియోజకవర్గంలో రెడ్ జోన్ గా ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ ను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సందర్శించారు. ఆదివారం నిత్యావసరాలకు వచ్చే ప్రజలతో రద్దీ పెరుగుతుందన్న ముందస్తు ఆలోచనతో మంత్రి అక్కడ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు, వినియోగదారులు భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అన్న అంశాన్ని ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించారు. లాక్ డౌన్  అమలవుతున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఆత్మకూరు నియోజకవర్గంలో టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు జరుగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వరకూ వెళ్లకుండా ఆత్మకూరులోనే పరీక్షలు నిర్వహిస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు మంత్రికి వివరించారు. లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఉన్న ప్రధాన ఇబ్బందులపై అధికారులతో ఆరా తీశారు. అందరం బాగుండడం కోసమే ఈ జాగ్రత్త చర్యలని మంత్రి తెలిపారు. కచ్చితంగా మాస్కులు, గ్లౌజులు ధరించి బయటకు రావాలన్నారు. మార్కెట్ లోని వ్యాపారులకు మాస్కులు అందిస్తామని హామీ ఇచ్చారు. 


అనంతరం మర్రిపాడు మండలంలోనూ మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు.  ఆదివారం ఆకస్మికంగా పర్యటించిన మండలాల్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరు, ప్రజల అవగాహన, సహకారంపై మంత్రి మేకపాటి సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కఠినంగా లాక్ డౌన్ ను అమలు  చేస్తూనే పరిస్థితులను బట్టి మానవత్వంతో స్పందించాలని మంత్రి గౌతమ్ రెడ్డి సూచించారు. నియోజకవర్గ  ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ తానున్నానంటూ మంత్రి గౌతమ్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత నెలరోజుల కరోనా విపత్తులో  నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిత్యం నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న నాయకులను, కార్యకర్తలను మంత్రి అభినందనలు తెలియజేశారు. ప్రజా సేవలో ముందుకు సాగుతూనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఇలాగే నిబద్ధతగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తే త్వరలోనే కరోనా నుంచి బయటపడతామని మంత్రి మేకపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ను ఇలాగే పాటించి సహకరించాలని నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి పిలుపునిచ్చారు.