కరోనా కష్టసమయంలో "వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం" తో భరోసా

*22.04.2020* 
*అమరావతి* 


*లాక్ డౌన్ తో వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న పొదుపు సంఘాలకు చేయూత*


*జీవనోపాధికి తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించలేని పొదుపు సంఘాలకు ఊరట*


*కరోనా కష్టసమయంలో "వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం" తో భరోసా*



*వడ్డీభారం రూ.1400 కోట్లను పూర్తిగా భరించనున్న ప్రభుత్వం.*



*24న “వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం”ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్.*



*వడ్డీ రాయితీ లాంఛనంగా బ్యాంకులకు జమ.* 


*రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపుసంఘాల మహిళలకు లబ్ధి.* 


*గత ప్రభుత్వం పొదుపు సంఘాలకు వడ్డీరాయితీలో మొండిచేయి చూపిన వైనం.* 


*పాదయాత్రలో మహిళల ఆర్థిక కష్టాలను స్వయంగా తెలుసుకున్న శ్రీ వైఎస్ జగన్.* 


*అధికారంలోకి రాగానే సున్నావడ్డీకి రుణాలు ఇప్పిస్తానని హామీ.* 


*కరోనా సంక్షోభంలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న సీఎం శ్రీ వైఎస్ జగన్.*



*రాష్ట్రలో అర్బన్ లో 1.83 లక్షల సంఘాలు, రూరల్ లో 6.95 లక్షల సంఘాలకు మేలు.*



కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోతున్నా లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ తో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. బ్యాంకుల నుంచి చిరు వ్యాపారాలు, జీవనోపాధికి రాష్ట్రంలో రుణాలు పొందిన పొదుపు సంఘాల మహిళలు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు చేసుకోలేక పోతున్నారు. చివరికి తాము తీసుకున్న రుణాలకు గానూ బ్యాంకులకు వడ్డీలు సైతం చెల్లించుకోవడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కష్టాలను గమనించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి "వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం" ద్వారా కరోనా సమయంలో పొదుపు సంఘాలకు అండగా నిలుస్తున్నారు. పొదుపుసంఘాలుగా బ్యాంకుల నుంచి వడ్డీకి రుణాలు తీసుకుని ఆర్థిక స్వావలంభన కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. పొదుపు సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీనిలో భాగంగా ఈనెల 24వ తేదీన ‘’వైయస్ఆర్ సున్నావడ్డీ’’ పథకంను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కరోనా సంక్షోభ సమయంలో... అన్ని వ్యవస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ... పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీతో భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నియంత్రణ నిబంధనలను పాటిస్తూ... క్యాంప్ కార్యాలయం నుంచే ‘’వైయస్ఆర్ సున్నా వడ్డీ’’ పథకంను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా పొదుపుసంఘాలు చెల్లించాల్సిన వడ్డీని బ్యాంకులకు లాంఛనంగా ప్రభుత్వం జమ చేయనుంది. జీవనోపాధికి తీసుకున్న రుణాలను చెల్లించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు చేసుకోలేక సతమతమవుతున్న పొదుపు సంఘాలకు ఈ సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న వడ్డీ రాయితీ నిర్ణయం గొప్ప ఉపశమనం కలిగిస్తోంది.



*మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వ చేయూత*  
రాష్ట్ర వ్యాప్తంగా 8.78 లక్షల సంఘాల్లో సభ్యులుగా వున్న 93 లక్షల మంది మహిళలకు సున్నావడ్డీ పథకం వల్ల లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్ల సాయం అందనుంది. ఈ పథకానికి సంబంధించి గతంలోనే సెర్ఫ్, మెప్మాలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా రెండు రోజుల కిందట రూ.765.19 కోట్లను విడుదల చేసినట్లు సెర్ఫ్ సిఇఓ పి. రాజాబాబు వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పొదుపుసంఘాలు చెల్లించాల్సిన వడ్డీని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు జిల్లాల్లో బ్యాంకులు 7 శాతం, మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13.5 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ భారాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వైయస్ఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రతి పొదుపు సంఘంకు పూర్తి వడ్డీ రాయితీని మూడు లక్షల రూపాయల గరిష్ట రుణం పరిమితి వరకు వర్తింప చేస్తున్నారు. 


*పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ*


స్వయం సహాయక సంఘ అక్కచెల్లెమ్మలకు..
గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ గ్రేడ్‌ సంఘాలు కూడా బీ, సీ, డీ గ్రేడులకు పడిపోయి.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలను నా 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. 


పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది. అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేయబోతోంది. 


అంతే కాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన, నామినేషన్‌పై కాంట్రాక్టులు – నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నాను.
ఇట్లు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌


*పొదుపుసంఘాలను నిర్వీర్యం చేసిన టిడిపి ప్రభుత్వం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి* 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలులో వున్న సున్నావడ్డీ పథకంను రాష్ట్ర విభజన తరువాత ఎపిలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. టిడిపి హామీ ఇచ్చిన మేరకు డ్వాక్రాసంఘాల రుణమాఫీ, వడ్డీ రాయితీలపై చిత్తశుద్దితో వ్యవహరించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాధి పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపుసంఘాలకు రుణమాఫీ కింద రూ.14,204 కోట్లు, వడ్డీ రాయితీ కింద రూ.3036 కోట్లను విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ఇంట్రస్ట్ రిడెమ్షెన్ గ్రాంట్ కింద కంటితుడుపుగా వడ్డీ రాయితీ కోసం నిధులను కేటాయించినప్పటికీ, పొదుపుసంఘాలు సకాలంలో బ్యాంకులకు వడ్డీలు చెల్లించకపోవడంతో పెరిగిన చక్రవడ్డీలభారంకు ఈ నిధులు ఏ మూలకూ సరిపోలేదని తెలిపారు. దీనితో ఆర్థిక క్రమశిక్షణ కలిగిన లక్షలాది సంఘాలు బ్యాంకుల దృష్డిలో బకాయిదారులుగా మిగలాల్సి వచ్చిందని అన్నారు. పొదుపు సంఘాలను ఆర్ధికంగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ సున్నావడ్డీ పథకంను అమలు చేయడంతో పాటు వైయస్ఆర్ ఆసరా పేరుతో పొదుపు మహిళలకు చేయూతను అందించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కరోనా విపత్తు సమయంలో మహిళల ఆర్ధిక స్వావలంబనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.