ఏపీలో అందుబాటులోకి కరోనా టెస్టింగ్‌ కిట్లు

ఏపీలో అందుబాటులోకి కరోనా టెస్టింగ్‌ కిట్లు
అమరావతి: కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు గౌతమ్‌రెడ్డి, ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌-19 ర్యాపిండ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను సీఎం పరిశీలించారు. కరోనా పరీక్షల కోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలోనే తయారు చేశారు. 
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కిట్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయ్యికిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కిట్ల ద్వారా 50 నిమిషాల్లోనే టెస్టింగ్‌ రిపోర్టు  తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేసేందుకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. ఇంకో వారం రోజుల్లో 10వేల కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యప్తంగా ఇప్పటికే ప్రత్యేక సర్వే చేసిన వైద్యఆరోగ్యశాఖ కొవిడ్‌ లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో దాదాపు 2వేల మందికి పరీక్షలు అవసరమని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా  కరోనా బాధితుల సంఖ్య 329కి చేరిన విషయం తెలిసిందే.