అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...

అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...


వింజమూరు, ఏప్రిల్ 15 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి) :ట్రాన్స్ కో శాఖ నిర్లక్ష్యం పలు చోట్ల ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా విద్యుత్ శాఖ పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక్క నెల విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే మందలు మందలుగా ఇళ్ళ వద్దకు వచ్చి బిల్లులు కడతారా లేక కనెక్షన్ కట్ చేయమంటారా అని దబాయించే అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందుతున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ స్థంభాలకు క్రింది భాగం నుండి పై భాగం వరకు చెట్లు అల్లుకుపోయాయి. వీటి పరిసరాలలో తరచూ మూగజీవాలు సంచరిస్తుంటాయి. అల్లుకుపోయిన ఈ చెట్లును మేసేందుకు మూగజీవాలు వెళ్ళిన సందర్భాలలో ఏ మాత్రం విద్యుత్ ప్రసారం చెట్లుకు ప్రసరించినా అభం శుభం తెలియని మూగజీవాల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయే ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. అంతేగాక ఈ చెట్లుకు ఉండే తీగెలు స్థంభాల పై భాగంలోని విద్యుత్ వైర్లకు ఎగబాకుతుండటంతో అడపా దడపా లైన్లు ట్రిప్ జరుగుతూ విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్వత్రా ప్రజలు కోరుతున్నారు.