తాడేపల్లి : కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. వయసు మళ్లినవారిలో ఈ వైరస్ ప్రభావం కొంత తీవ్రంగా ఉందని తెలిపారు.
కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదని ప్రజలు గుర్తించాలని కోరారు. కొన్నిచోట్ల దేశ ప్రధానులకు కూడా కరోనా వచ్చిందని గుర్తుచేశారు. వైరస్‌వచ్చిన వ్యక్తుల పట్ల వ్యతిరేకభావం చూపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఒక మీటింగ్‌కు వెళ్లి వచ్చినవారిలో పలువురికి కరోనా వచ్చినట్టుగా గుర్తించామన్నారు. ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం ఢిలీ మీటింగ్‌కు వెళ్లినవారే ఉన్నారని తెలిపారు. ఏపీ నుంచి మొత్తం 1085 మంది ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లారని తెలిపారు. వారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అనుమానితులుంటే ప్రజలు దగ్గరలో ఉన్న అధికారులు సమాచారమివ్వాలని సూచించారు.
ఢిలీ నుంచి వచ్చినవారు ఎవరైనా వైద్య పరీక్షలు చేయించుకోవకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 104కు ఫోన్ చేస్తే వైద్య సాయం అందిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నామని గుర్తుచేశారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతోందని చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ప్రజలు వారికి తెలియజేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చికిత్స చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆస్పత్రులు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
కరోనా నియంత్రణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారం పడిందని సీఎం జగన్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సహకారం మరిచిపోలేనిదని కొనియాడారు. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లవచ్చన్నారు. కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
వైరస్ సోకినవారిపై వివక్ష చూపొద్దు : సీఎం జగన్