ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తికి స్పందించిన పేర్ని

ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తికి స్పందించిన పేర్ని
మచిలీపట్నం : కరోనావైరస్ విపత్తు, లాక్‌డౌన్ సమస్యల నేపథ్యంలో జర్నలిస్టులను ఆదుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) విజ్ఞప్తి పట్ల రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయాలన్ని వర్తింపచేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే నానికి వినతి పత్రం అందజేసింది. యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు నంగిగడ్డ బాబు నాయకత్వంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా శాఖ ప్రతినిధులు ఆదివారం మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను మచిలీపట్నంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైద్యులు, పారామెడికల్, పారిశుధ్య సిబ్బంది, పోలీసులకు అమలుచేస్తున్న 50 లక్షల ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని, అలాగే మార్చి 31తో ముగిసిన జర్నలిస్టు హెల్త్ కార్డులను 2020-21 సంవత్సరానికి సంబంధించి అంతరాయం లేకుండా కొనసాగించాలని, కరోనా నేపథ్యంలో జిల్లాల్లో విధులు నిర్వహిసున్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లను, శానిటైజర్లు, మాస్క్‌లను సరఫరా చేయడంతో పాటు కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆదుకోవాలని వినతి పత్రంలో ఏపీయూడబ్ల్యూజే కోరింది.