కృష్ణా , గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు : మంత్రులు


తేది : 29.04.2020.
అమరావతి.


• 88,061 వేల పరీక్షలు నిర్వహించగా 86,729 నెగెటివ్, 1,332 పాజిటివ్ కేసులుగా ఫలితాలు


• కృష్ణా , గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు


• క్లస్టర్స్, రెడ్ జోన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక కార్యాచరణ


• త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారిని రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు


• కుటుంబ సమగ్ర సర్వే లో గుర్తించిన ప్రతి ఒక్కరికి వెంటనే వైద్య పరీక్షలు


• ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పునః ప్రారంభించాలి లేని యెడల కఠిన చర్యలు : ఉప ముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)


• కరోనా కట్టడితో పాటు ప్రజా సంక్షేమం పై ముఖ్యమంత్రి దృష్టి  


• దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు :హోంశాఖమంత్రి ఎం.సుచరిత


• జగనన్న గోరుముద్ద తరహాలో కరోనా బాధితులకు పౌష్టిహారం 


• ప్రభుత్వంపై ప్రతి పక్షాల విమర్శలు అర్ధరహితం  : వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు


• భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకుంటే కరోనాని నియంత్రించవచ్చు :ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్  


అమరావతి, 29 ఏప్రిల్ : కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రుల బృందం స్పష్టం చేసింది. సచివాలయం నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చికలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరోనాపై ఏర్పాటు చేయబడిన మంత్రులు బృందం స్పష్టం చేసింది.


ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ  కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై మంత్రుల బృందంలో చర్చించామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19పై ఈరోజు జరిగిన రాష్ట్రస్థాయి సమీక్షలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవివరమైన సమీక్ష చేశారని తెలిపారు. సమీక్షలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న కోవిడ్ ఆస్పత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారన్నారు. టెలీమెడిసిన్ అమలవుతున్న తీరుపై సీఎం జగన్ సమీక్షించారన్నారు.  లాక్ డౌన్ సమయంలో టెలీమెడిసిన్ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చూడాలని, తగినంత ప్రచారం కల్పించి, ప్రజలు లబ్ధి పొందేలా చేయాలని,  ఈ మేరకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. కుటుంబ సమగ్ర సర్వే లో గుర్తించిన ప్రతి ఒక్కరికి వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేయాలని చెప్పారన్నారు. అవసరమైతే అదనంగా  ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లు, వైద్యులు, నర్సులు, పరికరాలు(ఎక్విప్ మెంట్) సమకూర్చుకోవాలన్నారు.  ఈ సందర్భంగా కరోనా కట్టడికి అమలు చేస్తున్న కార్యక్రమాల అమలుతీరుపై ముఖ్యమంత్రి చర్చించారన్నారు. సీఎం సలహా, సూచనలను ఏ విధంగా అమలు చేయాలా అని మంత్రుల బృందం చర్చించిందన్నారు. కేంద్రం మార్గదర్శకాలు, సీఎం సూచనలు, ప్రజల విజ్ఞప్తుల మేరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్లందరినీ వీలైనంత త్వరగా వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి తక్షణమే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వకముందే గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామని గుర్తుచేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కచ్చితంగా ఓపి  సేవలు అందించాలని గతంలోనే ఆదేశించామని మరొకసారి ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులకు ఆ విషయం గుర్తుచేస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా ఓపీ సేవలు పునః ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఓపీ సేవలు అందించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కృష్ణా , గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యేకించి క్లస్టర్, రెడ్ జోన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.  రాష్ట్రంలో, ప్రత్యేకించి ఈ మూడు జిల్లాల్లో ఆస్పత్రుల సంఖ్య పెంచి మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కరోనా అనుకోకుండా వచ్చిన విపత్తు అని ఎన్ని ఇబ్బందులెదురైనా దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. 50 శాతం కరోనా బాధితుల్లో ఎటువంటి లక్షణాలు కనిపించడంలేదని తెలిపారు. ఢిల్లీ, విదేశాల నుండి వచ్చిన వారితో పాటుగా సర్వే ద్వారా సేకరించిన అందరినీ పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. సర్వే అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఇప్పటికీ ప్రభుత్వం 3 దశల్లో సర్వే చేసిందని మంత్రి తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేనిది వైరస్ ను అరికట్టలేమని ప్రభుత్వ పోరాటంలో ప్రజలు భాగస్వాములై కరోనా నివారణకు కృషిచేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, భౌతిక దూరం పాటించి, బాధ్యాతాయుతంగా ఉంటే కరోనాపై విజయం సాధించవచ్చన్నారు. సెక్రటేరియట్ లోని తమ శాఖకు చెందిన అటెండర్ కి కరోనా సోకిన మాట వాస్తవమేనని      ఆర్టీపీసీఆర్(రియల్‌టైమ్‌ పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్)   పరీక్షకు శాంపిల్స్ పంపడం జరిగిందని ఆ రిపోర్ట్ ఫలితం వచ్చిన తర్వాతే పాజిటివ్ గా నిర్ధారణ అవుతుందన్నారు.  ఈ క్రమంలో తనతో సహా తమ సిబ్బంది 13 మంది పరీక్షలు చేయించుకున్నామని, అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు.  ఈ మేరకు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో గడిచిన 24 గంటల్లో 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని గతంలోనే సీఎం ఆదేశించారని ఆ మేరకు దశలవారీగా పెంచుకుంటూ పోతున్నామన్నారు. ఇప్పటివరకు 88,061 వేల పరీక్షలు నిర్వహించగా అందులో 86,729 కేసులు నెగెటివ్ గా, 1,332 కేసులు పాజిటివ్ గా వచ్చాయపి మంత్రి వివరించారు. 13 జిల్లాల కలెక్టర్ల నుంచి వలస కార్మికుల డేటా సేకరించగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని తేలిందన్నారు. మరోసారి పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించుకుంటాని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సీఎం చేసిన సమీక్షలు, ఆలోచన వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పరీక్షలు నిర్వహించామని హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు.కోవిడ్ బాధితులకు అందిస్తున్న సేవలు గొప్పవన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే రాష్ట్రంలో లాబోరేటరీ సామర్థ్యం పెంపు, మరిన్ని సౌకర్యాల కల్పన చేస్తామన్నారు.ముఖ్యమంత్రి కరోనా కట్టడితో పాటు  ప్రజా సంక్షేమం మీద ప్రధానంగా దృష్టి సారించరన్నారు. ఇప్పటికే ఆ దిశగా సున్నా వడ్డీకింద డ్వాక్రా సంఘాలకు రుణాలు, జగనన్న విద్యాదీవెన ద్వారా పాత బకాయిలతో పాటు ఫీజురీయింబర్స్ మెంట్ చెల్లింపులు చేస్తున్నారన్నారు. అదే విధంగా మూడో విడత రేషన్ పంపిణీ చేపట్టామన్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి రూ.వెయ్యి అందజేశామన్నారు. ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా ఉండాలని కోరారు. మే 3 తర్వాత కేంద్రం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు పకడ్భందీ చర్యలు ఆచరించాల్సి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో కరోనా కట్టడికి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజల సహాయ సహకారం అవసరమన్నారు. ఈ సమయంలో విమర్శలు తగవని హితవు పలికారు.


కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంతమంది పనిగట్టుకొని విమర్శలు చేయడం తగదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హితవు పలికారు. తాము కేంద్రమంత్రితో, గుజరాత్ సీఎంతో మాట్లాడి  మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తుంటే అది తమ గొప్పగా కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడు నుంచి వలస కార్మికుల కోసం తాము పని చేస్తుంటే దానిని విమర్శించడం భావ్యం కాదన్నారు. పీఎం కిసాన్ రైతుభరోసా, జగనన్న విద్యా దీవెన, డ్వాక్రా సంఘాల మహిళల కోసం సున్నా వడ్డీ వంటి పథకాలను కష్టకాలంలోనూ అమలు చేస్తుంటే ప్రజలను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని 46.50 లక్షల మంది రైతులకు తొలి విడతలో ఇప్పటికే పెట్టుబడి సాయం అందించామని గుర్తుచేశారు. మే నెల 15 నుంచి రెండో విడతలో మరోసారి పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. లబ్ధిదారుల వివరాలు 15 రోజుల ముందే గ్రామసచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. అర్హత కలిగి లబ్ధిదారుడిగా ఎంపికకాకపోతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. సోషల్ ఆడిట్ జరిగాక కూడా అర్హులు ఎవరైనా ఉంటే తప్పకుండా సాయం అందిస్తామన్నారు. ఈ క్రమంలో ప్రతి కాల్ కు స్పందిస్తున్నామన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తికాకముందే 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించామని చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 32 వేలమంది రైతులను తొలగిస్తున్నట్లు తప్పుడు సంకేతాలను పంపడం సరికాదన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు జగనన్న గోరుముద్ద తరహాలో పౌష్టిహారం అందిస్తుంటే, రోగులకు ఎటువంటి ఆహారం అందిచడం లేదని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.  అరటి, బత్తాయి, మొక్కజొన్న, టమాట పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కూరగాయలను ప్రొక్యూర్ చేసి మొబైల్ బజార్లు, రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్నామన్నారు. కరోనా వేళ రాజకీయాలు తగదన్నారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్రంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు,మంత్రులు, అధికారులు,సిబ్బంది అంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సుమారు లక్ష వరకు యాంటీ బాడీ పరీక్షలు చేశామన్నారు. అనుకోని విధంగా విపత్తు వచ్చిందని, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. గత 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 780 కోట్లమంది ప్రజలను కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. దీన్ని నియంత్రించాలంటే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలు పాటించడమే మార్గమన్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలే నాటికి ఒక్క టెస్టింగ్ సెంటర్ కూడా లేకపోయినా ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణకు 9  మేజర్ లాబొరేటరీస్, 44 ట్రూనాట్ మిషన్లు, 8 వేల పైచిలుకు (సుమారు 15వేలకు పెంపు) పరీక్ష సామర్యంప్, గణనీయంగా కోవిడ్ ఆస్పత్రుల పెంపు చేశామన్నారు. దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న రోగులకు టెలీమెడిసిన్ విధానం కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. దగ్గర్లోని పీహెచ్ సీల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర సహాయం కోసం 14410, 104 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని, అంబులెన్స్ సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయని సూచించారు.