ముఖ్యమంత్రికి అవగాహన కల్పించని సలహాదార్లు రాజీనామా చేయాలి:   వర్ల రామయ్య డిమాండ్ 


కరోనాపై ముఖ్యమంత్రికి అవగాహన కల్పించని సలహాదార్లు రాజీనామా చేయాలి:  
: వర్ల రామయ్య డిమాండ్ 
కరోనా వైరస్ తీవ్రతపై సీఎం జగన్ కు అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వ సలహాదార్లు రాజీనామా చేయాలని తెదేపా ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ``కరోనా వైరస్ చిన్నపాటి జ్వరం వస్తుంది, పోతుంద’’ని ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంతుంటే సలహాదార్లు ఏ పుట్టలో దాగారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాపై  అవగాహనా రాహిత్యంతో చేసిన  ప్రకటనతో ప్రపంచమంతా నివ్వెరపోయిందని వర్ల పేర్కొన్నారు. ``కరోనా, మనం కలిసి,మెలిసి జీవించాలి’’అని జగన్ తేలిగ్గా తీసుకుంటే మరి దేశ ప్రధానికి, ఇతర  ముఖ్యమంత్రులకు ఈ విషయాలు తెలియవా? అని నిలదీశారు. కరోనాపై అవగాహనా లేక ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలను కంఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. కరోనా సాదాసీదా జ్వరంలాంటిదైతే ఇప్పటివరకూ ప్రపంచ దేశాల్లో 2,07,254 మంది ఎందుకు మృత్యువాత పడ్డారో వైకాపా నేతలు సమాధానమివ్వాలన్నారు. కరోనా వ్యాప్తికి తెదేపా స్లీపర్ సెల్స్ కారణమని మంత్రి మోపిదేవి ఆరోపించడం, బయటకు వస్తే కోరంటైన్ కు పంపుతామని డీజీపీ గౌతమ్ సావంగ్ హెచ్చరించడం ఎందుకని నిలదీశారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడినదానికి భిన్నంగా మంత్రి, డీజీపీల ప్రకటనలు ఉండటంతో ప్రజల్లో గందరగోళ స్థితి నెలకొందన్నారు. ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న  కరోనా వైరస్ తో ``సహజీవనం చేయాలని’’ ముఖ్యమంత్రి జగన్ తేలిగా తీసుకుని మాట్లాడుతుంటే అవగాహన కల్పించలేని సలహాదార్లు  ఏ పుట్టలో దాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ``మన వారు ‘’ అనే ఆలోచన విడనాడి  ప్రపంచంలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలిసి సలహాలిచ్చే వివేకవంతులను నియమించుకోవాలని సూచించారు.