ఈటీవీ విలేకరి మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం
హైదరాబాద్: కుక్కకాటుకి ఈటీవీ పాత్రికేయుడు పూండ్ల శ్రీనివాస్(48) మృతిచెందారు. చెన్నై కేంద్రంగా ఈటీవీ ప్రసారాలు మొదలు పెట్టినప్పుడు ‘వాయిస్ ఓవర్ ఆర్టిస్టు’గా చేరిన శ్రీనివాస్ ఆ తర్వాత చెన్నై ఈనాడు స్థానిక విలేకరిగా సేవలందించారు. గత పదిహేనేళ్లుగా ఈటీవీ చెన్నై విలేకరిగా పనిచేశారు. మార్చి నెలలో హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. హయత్‌నగర్‌లో నివసిస్తున్న ఆయన.. మార్చి మొదటివారంలో కుక్కకాటుకి గురయ్యారు. గతవారం రేబిస్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకి మృతిచెందారు.
శ్రీనివాస్ స్వస్థలం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని అనకర్లపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఆయనకి భార్య, కొడుకు ఉన్నారు. శ్రీనివాస్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విటర్ ద్వారా విచారం వ్యక్తంచేశారు. ‘వృత్తిపట్ల నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం ఆయన్ని ఆదర్శపాత్రికేయుడిగా నిలిపాయి. ఆయన వ్యక్తిగతంగా నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను...!’ అని ట్వీట్ చేశారు.
ఈటీవీ విలేకరి మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం