సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
విజయవాడ : ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బలహీన వర్గాల గృహ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రోడ్లు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగించే సిమెంట్ ధరలు వ్యత్యాసాన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ గా “వైయస్ఆర్ నిర్మాణ్” ను తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రెటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున అందుకు అవసరమైన సిమెంటు ను సిమెంట్ కంపెనీల నుంచి తక్కువ ధరకు సకాలంలో పారదర్శకంగా సేకరించాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో గత నెలలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంప్రదింపులు జరిపి నూతన విధానాన్ని, ధరలను నిర్ణయించడంలో భాగంగా ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు 2020, మార్చి16 నుండి ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే సిమెంట్ కు వస్తు సేవా పన్ను(జిఎస్టీ)లతో కలిపి పోర్ట్ లాండ్ పొజోలాన్ సిమెంట్ ధర రూ. 225 లు, ఆర్డినరీ పోర్ట్ లాండ్ సిమెంట్ ధర రూ. 235 లు చెల్లించాలని నిర్ణయించారన్నారు. అదేవిధంగా కంపెనీలు ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంటును ఎరుపు రంగు బ్యాగులలో సరఫరా చేయడం ద్వారా ప్రయివేటు వ్యక్తులు, సంస్దలకు సరఫరా చేసే సిమెంటు నుండి వేరుచేసి దుర్వినియోగం కాకుండా చూడాలని ఆదేశించారన్నారు. సిమెంట్ సేకరణ, చెల్లింపుల కొరకు సింగిల్ పాయింట్ నోడల్ ఏజెన్సీగా కలెక్టర్ల తో నోడల్ వ్యవస్థను ఉంచాలని నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రాజెక్టులకు అవసరమైన సిమెంటును సిమెంట్ కంపెనీల నుండి పారదర్శక వ్యవస్థ ద్వారా సేకరించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం గా “వైయస్ఆర్ నిర్మాణ్” అభివృద్ధి చేయబడింది. ఈ వ్యవస్థ ద్వారా కొనుగోలుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఎటువంటి జాప్యం లేకుండా ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహాయపడుతుందన్నారు. అదేవిధంగా కొనుగోలులో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచటంతో పాటు డిమాండ్ ప్రకారం సిమెంటును ఉత్పత్తి చేయడానికి సరఫరాదారులకు సహాయపడుతుందని ప్రభుత్వ అన్ని విభాగాలు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని www.apindustries.gov.in/YSRNS/Index.aspx వద్ద ఉపయోగించకోవచ్చని తెలిపారు.
ఈ వ్యవస్థలో, ప్రభుత్వ విభాగాలు, జిల్లా కలెక్టర్లు, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ తయారీ సంఘం,సరఫరాదారులకు పోర్టల్‌లో యాక్సిస్ ఇవ్వటంతో పాటు వారికి యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ కేటాయించబడతాయన్నారు. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి, ప్రతి జిల్లాలోని ప్రతి విభాగం నుండి ఇద్దరు అధికారులు (స్థాయి-1&స్థాయి-2) వినియోగదారు ఐడీ లు మరియు పాస్‌వర్డ్ ను కేటాయించాలన్నారు. స్థాయి -2 అధికారి సంబంధిత విభాగాల అవసరాలకు అనుగుణంగా స్థాయి -1 అధికారి కోసం లాగిన్ ఐడిలను సృష్టించాలన్నారు.
అదేవిధంగా పరిశ్రమల శాఖ కమీషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టీసీఎస్ వర్కింగ్ టీమ్ మరియు ఆర్థిక శాఖ నుండి నామినేట్ చేయబడిన డిప్యూటీ సెక్రటరీ స్థాయికి తక్కువకాని అధికారి తో ఏర్పాటు చేసిన “వైఎస్ఆర్ నిర్మాణ్ సెల్” ద్వారా పోర్టల్ యొక్క విధులను పర్యవేక్షించడంతో పాటు ప్రతివారం పరిశ్రమల శాఖ గౌరవనీయ ముఖ్యమంత్రి కార్యదర్శి కి నివేదికలు పంపాలని తెలిపారు. ఇక నుండి ప్రభుత్వ శాఖలు పరిశ్రమల శాఖ చే జారీ కాబడిన జీవో మార్గదర్శకాలను అనుసరించి సిమెంట్ కొనుగోలు చేయాలని సమాచార శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం