ముఖ్యమంత్రి కి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి లేఖ

గౌ. జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి..
నమస్కారములు..


విషయం : విదేశాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను స్వస్థలాలకు రప్పించడం – ఆహారం, నిత్యావసరాలను అందించి అండగా నిలవడం కొరకు..


 ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న ప్రళయాన్ని కళ్లారా చూస్తున్నాం. ఇలాంటి సమయంలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు, ఉద్యోగార్ధులను రక్షించడంలో, వారికి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. విద్యార్ధులంటే మన రాష్ట్ర సంపద. మన ఆస్తి. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. సుమారు 5 లక్షల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు విదేశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. కరోనా ప్రళయం మొదలైన వెంటనే స్వస్థలాలకు చేరుకునేందుకు చాలా మంది విద్యార్ధులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ.. విమానాలు రద్దు కావడం, ఆయా దేశాల్లో కూడా లాక్ డౌన్ విధించడం వలన ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరికొంత మంది విమానాశ్రయాల వరకు చేరుకుని.. అక్కడి నుండి వెనక్కి వెళ్లలేక, స్వస్థలాలకు రాలేక అక్కడే ఉండిపోయారు. దాదాపు 20 రోజులుగా వారందరూ భోజనం కూడా అందక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారు. తొలుత విమానాశ్రయ సిబ్బంది, భారత రాయబార కార్యాలయం సదుపాయాలు కల్పించినా.. తర్వాత లాక్ డౌన్ వంటి నిర్ణయాలతో ఆహారం అందించేవారు కూడా కరువయ్యారు.
 తాజాగా విదేశాల నుండి వచ్చినప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా మన దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఆగిపోయిన వారు కూడా వేలల్లో ఉన్నారు. రవాణా సదుపాయాలు లేక, ఇళ్లకు చేరలేక, క్వారంటైన్ నిబంధనల కారణంగా ఇప్పటికీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. స్వదేశంలో ఉన్నప్పటికీ వారూ ఆహారం లేక అలమటిస్తున్నారు. క్వారంటైన్ కు వెళ్లేందుకు సిద్ధపడ్డప్పటికీ కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలి. విదేశాల్లో ఉన్నత విధ్యను అభ్యసించేందుకు వెళ్లి ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు దాపురించడం బాధాకరం. అలాంటి వారికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించండి. అక్కడి భారత రాయభార కేంద్రాల ద్వారా ఆహార సరఫరా పునరుద్ధరించండి. ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి  తీసుకొచ్చి వారి తల్లిదండ్రుల కన్నీటి కడగండ్లను తుడవండి. అవసరం అనుకుంటే వచ్చిన వారందరినీ క్వారంటైన్ కు ఒప్పించండి. ప్రత్యేక భద్రత నడుమ క్వారంటైన్ కు తరలించండి. దేశం కాని దేశంలో మన విధ్యార్ధులు పడుతున్న కష్టాలను గుర్తించండి.
(బుచ్చి రాంప్రసాద్)
టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి)