ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు లేఖ

గౌ శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.
విషయం: రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ నియంత్రణ-టిడిపి పోలిట్ బ్యూరో తీర్మానాలు-రాష్ట్ర ప్రభుత్వ చర్యల నిమిత్తం..
----
రాష్ట్రంలో కోవిడ్ వైరస్ కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్వల్పకాలంలోనే 3వ దశ ‘‘సామాజిక వ్యాప్తి’’ దశకు చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మొదటి, రెండు దశల్లోనే వైరస్ వ్యాప్తిని నిరోధించివుంటే ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులే చెబుతున్నారు. మొగ్గలోనే దీనిని నిరోధించివుంటే ఇంత మానుగా మారేది కాదనే భావన ప్రజల్లో సర్వత్రా నెలకొంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల బాధ్యతలు, రాజకీయ పార్టీల బాధ్యత, ప్రజల బాధ్యతల గురించి మన రాజ్యాంగ నిర్మాతలు 70ఏళ్ల క్రితమే స్పష్టంగా విశదీకరించారు. విపత్తుల్లో చిక్కుకున్న బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం, ఒక సామాజిక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ గత 37ఏళ్లుగా కృషి చేస్తూనే ఉంది. 
బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మొదటినుంచి కరోనా తీవ్రతపై రాష్ట్ర  ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. కరోనా ప్రబలకుండా ముందుజాగ్రత్తలపై ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవాటిపై కరపత్రాల పంపిణీ, వీడియోల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. నిపుణులతో నిరంతరం చర్చలు జరుపుతూ వారిచ్చే సూచనలను ప్రభుత్వాలకు, ప్రజలకు తెలియజేస్తున్నాం. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి మార్గాంతరాలను అన్వేషించాలని ఇప్పటికే అనేక లేఖల ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిన్న (గురువారం)ఆన్ లైన్ లోనే నిర్వహించాం. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ భేటిలో చర్చించిన అంశాలను, పోలిట్ బ్యూరో తీర్మానాలను ఈ లేఖ ద్వారా మీకు పంపిస్తున్నాం. ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో, ఇతర నిపుణులతో వీటిపై చర్చించి రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా సరైన నిర్ణయాలను సత్వరమే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
టిడిపి పోలిట్ బ్యూరో తీర్మానాలు: 
1)దేశంలో కరోనా విపత్తు తీవ్రత దృష్ట్యా, లాక్ డౌన్ పీరియడ్ ను ఈ నెలాఖరుదాకా పొడిగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం..
2)విశాఖ మెడ్ టెక్ జోన్ పై పూర్తి శ్రద్ద పెట్టి అభివృద్ది చేయాలి. మరిన్ని కంపెనీలను ఇక్కడకు రాబట్టి వైద్య సిబ్బందికి కావాల్సిన రక్షణ ఉపకరణాలు (పిపిఈ), టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీని వేగవంతం చేయాలి.
3) కరోనా బాధితులకు సేవలు అందిస్తూ, మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ 50లక్షలు ఇన్సూరెన్స్ కేంద్రం ప్రకటించింది. దానితోపాటు కరోనా సోకి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 25లక్షలు ఆర్ధిక సాయం అందించాలి. 
4)ధాన్యం, పత్తి, మిర్చి, పండ్లతోటల ఉత్పత్తులను, ఆక్వా ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రూ 3వేల కోట్ల మార్కెట్ స్థిరీకరణ నిధి పెడతామని, రూ 4వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధి పెడతామని ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలి. 
5)లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాలను, భవన నిర్మాణ కార్మిక సంక్షేమనిధిలో ఉన్న రూ1,500కోట్ల నుంచి ఆదుకోవాలి.
6) చేతివృత్తులవారు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, పేద ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు, ప్రతి పేదకుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలి.
7) రైతుల కరెంట్ బిల్లులు, వీవర్ వర్క్ షాప్ లు, లాండ్రీలు, క్షవరశాలలు, చేతివృత్తులవారు, చిరువ్యాపారుల విద్యుత్ బిల్లులు, ఇతర పేద కుటుంబాల కరెంటు బిల్లులు, నీటి బిల్లుల వసూళ్లను రద్దు చేయాలి.
8)ఇతర దేశాల్లో, బైట రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు, వలస  కార్మికులు, మత్య్ికారులను ఆదుకోవాలి. వారు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేలా రాష్ట్రప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
9) రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనుమానితులు అందరికీ ఉచితంగా టెస్టింగ్ లు చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ 4 టి విధానం అమలు చేయాలి. వైరస్ సోకిన వారిని గుర్తించి, ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి, సకాలంలో సరైన చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలి, వారినుంచి ఈ వైరస్  ఇతరులకు సోకకుండా కట్టడి చేయాలి. ప్రజల ప్రాణాలను  కాపాడటంలో ఏమాత్రం నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించరాదు.
10)డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకు సరైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్(పిపిఈ)లను సత్వరమే అందజేయాలి.


11)నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి. మాస్క్ లు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం అమానుషం. ఆయనపై సస్పెన్షన్ వెంటనే ఎత్తేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన డాక్టర్లు, వైద్య సిబ్బందిలో మనోధైర్యం పెంచాలి. 
12) పేదలకు 3నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు, గ్యాస్ సిలిండర్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం ఇంటికే అందించాలని సూచించింది. కేంద్రం ఇచ్చేవాటికి అదనంగా రాష్ర్  ప్రభుత్వం నుంచి కూడా కేరళ ప్రభుత్వ తరహాలో ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలి. 
- ఏపిలో ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని ముందుచెప్పి, తర్వాత మళ్లీ రివర్స్ లో చౌకడిపోల వద్దే పంపిణీ చేయడం వల్ల కార్డుదారులు గుంపులుగా చేరి భౌతిక దూరం పాటించడమే ప్రశ్నార్ధకమై, వైరస్ మరింత ప్రబలే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో ఇచ్చే రేషన్ అయినా ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలి.
13)టిడిపి ప్రభుత్వం తెచ్చిన వినూత్న సంక్షేమ పథకాలు  అన్నా కేంటిన్లు, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, గిరిజనులకు ఫుడ్ బాస్కెట్, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ తదితరాలను రద్దు చేయకుండా కొనసాగించి వుంటే ఇప్పుడీ పరిస్థితిలో పేదలకు ఒక వరంగా ఉండేవి. కాబట్టి మీరు రద్దు చేసిన ఆ పథకాలన్నింటినీ వెంటనే పునరుద్దరించాలి. 
14)రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతం కన్నా ఈ ఏడాది బాగుంది. కేంద్రం నుంచి కూడా నిధులు సమృద్దిగా వచ్చాయి. ముఖ్యమంత్రి సంక్షేమ నిధి(సీఎంఆర్ ఎఫ్)కు అనేక సంస్థలు, వ్యక్తులు భూరి విరాళాలు ఇచ్చారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ నియంత్రణకు పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ధర్మం కాదు. కాబట్టి ఉద్యోగులు, పించనీర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోతలు లేకుండా పూర్తిస్థాయిలో చెల్లించాలి. 
15) కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శ్రద్ద పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర సంక్షోభంలో కూడా, రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టడం భావ్యం కాదు. 
-రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటుపై సర్వే చేయడం, అనేక చోట్ల జెసిబిలతో ఇళ్ల స్థలాల చదును చేయడం, యూనివర్సిటిల పాలకమండళ్ల  నియామకంలో ఒకే సామాజికవర్గం వారిని పెద్దఎత్తున నియమించడం, ఒకవైపు దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఇసుక, మట్టి వందలాది లారీల్లో అక్రమ రవాణా చేయడం,  అన్నిచోట్లా దొంగచాటుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర 
పోషించడం, కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని, టిడిపి నాయకులను నిందించడాన్ని మానుకోవాలని కోరుతున్నాం. 
 రాజకీయ ప్రయోజనాల కన్నా, ప్రజా ప్రయోజనాలే మిన్నగా పనిచేయడం ద్వారా ప్రస్తుత కరోనా సంక్షోభంలో నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని,   తక్షణ ఉపశమన చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
నారా చంద్రబాబు నాయుడు
(తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు)


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image