పొగాకు రైతుల సమస్యపై బోర్డు చైర్మన్ కు చంద్రబాబు లేఖ    

పొగాకు రైతుల సమస్యపై బోర్డు చైర్మన్ కు చంద్రబాబు లేఖ
                       లాక్‌డౌన్ కారణంగా ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటికే 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందని, దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లో విక్రయించే అవకాశం రైతులకు ఉందని, కానీ పొగాకు రైతులకు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. మార్చి తొలి వారంలోనే జరగాల్సిన తొలి దశ వేలం కరోనా కారణంగా వాయిదా పడిందని, ఇది మరింత ఆలస్యమైతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. బోర్డు వెంటనే స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.