రేషన్ షాపులను తనిఖీ చేసిన తహసిల్ధారు

రేషన్ షాపులను తనిఖీ చేసిన తహసిల్ధారు


వింజమూరు ఏప్రిల్ 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని రేషన్ షాపులను శుక్రవారం ఉదయం తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావు తనిఖీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి చౌక దుకాణాల ద్వారా రెండవ విడతలో భాగంగా బియ్యం, శనగల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి అందుకనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. ఏప్రిల్ 14 కు ముగిసే లాక్ డౌన్ తంతును కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మే నెల 3 వరకు కేంద్రప్రభుత్వం పొడిగించిన విషయం విదితమే. అందులో భాగంగా రేషన్ షాపుల ద్వారా రెండవ విడతగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, శనగలను పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. చౌక దుకాణాల వద్ద వినియోగదారులు సమదూరం పాటించి వరుస క్రమంలో రేషన్ సరుకులను తీసుకోవాల్సి ఉండగా పలు చోట్ల ఈ నిబంధనలు బుట్టదాఖలవుతున్నాయి. కనీస దూరం ఉండేందుకు, మాస్కులు ధరించేందుకు పలువురు వినియోగదారులు విముఖత చూపుతున్నారు. తహసిల్ధారు, యం.పి.డి.ఓ  లు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం అందుబాటులో ఉన్న వాటిని క్యూ లైన్లలో ఉన్న వారు ముఖాలకు ధరిస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను క్షుణ్ణంగా గమనించిన అధికారులు రేషన్ షాపులు తెరవక ముందే దుకాణాల వద్దకు చేరుకుంటూ డీలర్లు, కార్డు హోల్డర్లకు తగు సూచనలిస్తున్నారు. వింజమూరు తహసిల్ధారు మాత్రం రేషన్ షాపుల వద్ద సుడిగాలి పర్యటనలు చేస్తూ రేషన్ సరుకుల పంపిణీ తీరు తెన్నులను పరిశీలిస్తూ అడపా దడపా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి అక్షింతలు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు మాత్రం ఉదయాన్నే చౌక దుకాణాల వద్ద తిష్ట వేస్తుండటం పట్ల సరుకుల పంపిణీ సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవలకు ఆస్కారం లేకుండా రేషన్ సరుకుల పంపిణీ సజావుగా సాగుతున్నదని కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.