వింజమూరులో లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం : ఎస్.ఐ బాజిరెడ్డి

వింజమూరులో లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం : ఎస్.ఐ బాజిరెడ్డి


.వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేశామని ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో వాటిని నియంత్రించే దిశగా వింజమూరు మండలంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా మండల సరిహద్దుల్లో 6 మొబైల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరందరూ కూడా ఆయా చెక్ పోస్టుల పరిధిలో షిఫ్ట్ ల వారీగా 24/7 విధులను నిర్వహిస్తుంటారని ఎస్.ఐ తెలిపారు. వింజమూరు చెంతనే ఉన్న కొండాపురం మండలం పార్లపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతం నుండి ప్రజలెవరూ కూడా వింజమూరు మండలంలోకి ప్రవేశించరాదని, అలాగే వింజమూరు వాసులు బయటి ప్రాంతాలకు ప్రయాణాలు సాగించవద్దని ఎస్.ఐ కోరారు. ఈ కరోనా మహమ్మారి నివారణకు ఇంతవరకు మందు లేదని, కేవలం ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండి తగు జాగ్రత్తలు వహిస్తే తప్ప పెను ముప్పు నుండి బయట పడలేమని ఎస్.ఐ తేల్చి చెప్పారు. దేవుని దయ వలన ఇప్పటివరకు వింజమూరులో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం ప్రజల అదృష్టమని బాజిరెడ్డి అన్నారు. అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్ లకు తరలిస్తూ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం కొంతమంది క్వారంటైన్ లో ఉన్నారని, రిపోర్టులు రాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడిస్తామన్నారు. దయచేసి ఎవ్వరూ కూడా వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దన్నారు. నిత్యం రద్దీగా ఉండే వింజమూరు వీధులు కొన్ని సమయాలలో మినహా ప్రజలందరూ కూడా స్వీయ నిర్భంధంలో ఉండి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తుండటం అభినందనీయమని ఎస్.ఐ వింజమూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.


కానీ కొంతమంది ఏదో కొంపలు అంటుకుపోయినట్లు, తాము వీధులలోకి రాకపోతే ఉపద్రవాలు ముంచుకొస్తున్నట్లు ఫీలవుతూ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం సబబు కాదన్నారు. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని తెలిసి కూడా అజ్ఞానంతో వ్యవహరిస్తుండటం అత్యంత భాధాకరమన్నారు. 144 సెక్షన్ అమలులో తమకు పూర్తి స్థాయిలో అధికారాలు ఉన్నప్పటికీ వింజమూరు ప్రజలు సహృదయులని భావిస్తూ వీధులలోకి రావద్దంటూ ప్రాధేయపడుతున్నామన్నారు. దయచేసి తమ విన్నపాలను అర్ధం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. వింజమూరు మండలంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా ఉండేందుకు గానూ ప్రజలందరూ కూడా చాలెంజ్ గా తీసుకుని అందుకనుగుణంగా వ్యవహరించాలని ఎస్.ఐ విజ్ఞప్తి చేశారు. స్వీయ నిర్భంధంతోనే నూరుశాతం కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల నుండి వింజమూరుకు ఎవరు వచ్చినా వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.