ఇబ్బందుల్లో క్షురకుల జీవితాలు. ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్న సంఘాలు.
వేదం .... నాదం అంటారు పెద్దలు. సర్వలోకాలను పాలించి, మేల్కొపే భగవంతుడిని సైతం వేదమంత్రాలతో బ్రాహ్మణులు, మంగళ నాద వాయిద్యాలతో నాయీ బ్రాహ్మణులు మేల్కొపుతారు. నాయీ బ్రాహ్మణులను వ్యవహారికంగా మంగళ్ళుగా పిలుస్తుంటారు. మంగళ్ళు అంటే మంగళకరులు, శుభకరులు అని అర్థం. అలాంటి నాయీ బ్రాహ్మణుల జీవితాలు కోవిద్-19 @ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మంగళకరమైన రోజులు కనుమరుగయ్యాయనే చెప్పాలి. నాయీ బ్రాహ్మణుల ప్రధాన వృత్తి క్షవరం చేయడం, మంగళ వాయిద్యాలు మ్రోగించడం. ప్రాచీనకాలం నుండి నాయీ బ్రాహ్మణులు సామాజిక వైద్యులుగా కూడా పేరుగాంచారు. అలాంటి నాయీ బ్రాహ్మణులు వృత్తిలో భాగంగా తల వెంట్రుకలు కత్తిరించడం, తైల మర్దనం చేయడం వలన వ్యక్తులకు అత్యంత సమీపంలో పనిచేస్తుంటారు. అందువలన కరోనా వాహకులుగా మారే ప్రమాదం ఉందని క్షౌరశాలలకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వలేదు. క్షౌరశాలలు మూతపడిన నేపధ్యంలో పనిలేక వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. క్షౌర వృత్తిదారులు అందరూ దాదాపు దారిద్ర్యరేఖ దిగువకు చెందినవారే. క్షౌరశాలల అద్దెలు, ఉపకరణాల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో ఋణాలు తీసుకుని నిర్వహిస్తుంటారు. అనేక సందర్భాలలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద రోజువారీ సర్దుబాటు ఋణాలు కూడా అధిక వడ్డీలకు తీసుకుని కుటుంబ అవసరాలు తీర్చుకొంటుంటారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చేసిన అప్పులు తీర్చలేక, రోజువారీ కుటుంబ అవసరాలు తీర్చలేక నానావస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాయీ బ్రాహ్మణుల కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షౌరశాలలు తెరిచే వరకు నెలకు పదివేల రూపాయలు వంతున ప్రభుత్వం తాత్కాలిక భృతి అందించాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కోట.చంద్రశేఖర్ కోరారు.
ఇబ్బందుల్లో క్షురకుల జీవితాలు. ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్న సంఘాలు.