అనేక రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా పాజిటివ్ రేటు తక్కువ: జవహర్ రెడ్డి

అనేక రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా పాజిటివ్ రేటు తక్కువ: జవహర్ రెడ్డి
మీడియాతో మాట్లాడిన వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఏపీ పాజిటివ్ రేటు 1.57 అని వెల్లడి
దేశవ్యాప్త పాజిటివ్ రేటు 4.13 అని వివరణ
అమరావతి : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కరోనా నివారణ చర్యల వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిపిన పరీక్షల్లో 79,075 శాంపిళ్లు నెగెటివ్ గా వచ్చాయని, ఎన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే, అంత త్వరగా రోగులను గుర్తించే వీలుంటుందని, ఈ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. 10 లక్షల మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నది ఏపీనే అని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికి 1504 కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తమిళనాడులో 10 లక్షల మందికి 1103 పరీక్షలు, రాజస్థాన్ లో 1,077 పరీక్షలు చేశారని తెలిపారు. కరోనా పాజిటివ్ రేటు కూడా ఏపీలో తక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 కరోనా పరీక్షలు చేసి 1259 పాజిటివ్ కేసులు ఉన్నట్టు తేల్చామని, దేశవ్యాప్తంగా 7,16,733 పరీక్షలు చేశారని, వీటిలో 29,572 కేసులు పాజిటివ్ గా తేలాయని అన్నారు.
ఆ లెక్కన దేశవ్యాప్తంగా పాజిటివ్ రేటు 4.13 గా ఉందని, మహారాష్ట్ర పాజిటివ్ రేటు 7.46గా ఉందని, మధ్యప్రదేశ్ లో 8.44గా నమోదైందని, గుజరాత్ లో 6.62 అని, తమిళనాడులో 2.28 అని తెలిపారు. ఏపీలో పాజిటివ్ రేటు 1.57 మాత్రమేనని, అనేక రాష్ట్రాలతో పోల్చితే కరోనా నివారణ చర్యల్లో రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్న విషయం తెలుస్తోందని జవహర్ రెడ్డి వివరించారు.